Share News

Amit Shah: తెలంగాణలో వచ్చేసారి అధికారం మనదే

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:30 AM

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయమే అందుకు నిదర్శనమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

Amit Shah: తెలంగాణలో వచ్చేసారి  అధికారం మనదే

  • ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం

  • విభేదాలు పక్కనపెట్టి కష్టపడి పనిచేయండి

  • తెలంగాణ బీజేపీ ఎంపీలకు అమిత్‌షా ఉద్బోధ

  • ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డిలకు అభినందనలు

  • రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం ఉగాదిలోపే?

న్యూఢిల్లీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయమే అందుకు నిదర్శనమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. విభేదాలను పక్కన పెట్టి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉత్సాహంగా పనిచేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఉద్బోధించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. కొత్త ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిని ఆయన అభినందించారు. కాంగ్రెస్‌ పాలనపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, గ్యారెంటీల అమలులో ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ విఫలమైందని అమిత్‌ షా అన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన మల్క కొమురయ్య, అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎన్‌వీ సుభా్‌షలతో కూడిన బీజేపీ రాష్ట్ర ప్రతినిధుల బృందం అమిత్‌ షాతో ఢిల్లీలో సమావేశమైంది. వారితో పాటు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలోని ఆ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంటు భవనంలో అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను అమిత్‌ షాకు వివరించారు. ఎమ్మెల్సీల గెలుపుతో ఉత్తర తెలంగాణలో బీజేపీ మరింత పట్టు సాధించిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సిటింగ్‌ సీటును కోల్పోయిన విషయాన్ని తెలుసుకొని అమిత్‌ షా ఆశ్చర్యపోయారు. మరోవైపు, గురువారం సాయంత్రం తెలంగాణ ఎంపీలు, నూతన ఎమ్మెల్సీలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం అరగంటపాటు సాగింది.


ఉగాదిలోపే కొత్త అధ్యక్షుడు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామక ప్రకటన ఉగాదిలోపే వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అమిత్‌ షా, నడ్డాతో ఎంపీలు, రాష్ట్ర ప్రతినిధుల భేటీ అనంతరం బీజేపీ వర్గాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్‌, ధర్మపురి అర్వింద్‌, ఎన్‌.రాంచందర్‌రావు ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఉపాధ్యాయులు, పట్టభద్రులు మార్పు కోరుకుంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సమాజంలో అన్ని వర్గాలు కాంగ్రెస్‌ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పతనానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం నాంది పలికిందన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడాలని అమిత్‌ షా, నడ్డా సూచించినట్లు ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్పారు.

Updated Date - Mar 21 , 2025 | 04:30 AM