Share News

Bandi Sanjay: తెలుగు విశ్వవిద్యాలయానికి.. పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలి

ABN , Publish Date - Mar 17 , 2025 | 04:03 AM

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: తెలుగు విశ్వవిద్యాలయానికి.. పొట్టి శ్రీరాములు పేరును   కొనసాగించాలి

  • ఎన్టీఆర్‌, బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లు తొలగించే దమ్ముందా?

  • అర్బన్‌ నక్సల్స్‌ చేతికి కులగణన నివేదిక కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/సిరిసిల్ల మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. దేశ భక్తుడు, గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆర్యవైశ్యుల ఆరాధ్య నేత అయిన గొప్ప వ్యక్తి పేరును తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. సీపీ ఐ నాయకులు ప్రతిపాదిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి కులాభిమానంతో పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టారని తెలిపారు. ఆంధ్రా మూలాలు ఉన్నాయని పొట్టి శ్రీరాములు పేరును తొలగించారని.. ఎన్టీఆర్‌, కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేరిట ఉన్న పార్కుల పేర్లను తొలగించే దమ్ముందా..? అని ప్రశ్నించారు. ట్యాంక్‌ బండ్‌పై ఉన్న అనేక మంది ఆంధ్రుల విగ్రహాలను కూడా తొలగిస్తారా..? అని నిలదీశారు.


తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలని.. ఆర్యవైశ్యులు, దేశభక్తులకు సీఎం క్షమాపణ చెప్పాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సర్కారు రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తోందని సంజయ్‌ విమర్శించారు. 15 నెలల్లోనే ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసిందని.. రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపబోతోందని ధ్వజమెత్తారు. ఆదివారం సిరిసిల్లలోని మున్నూరు కాపు ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన జిల్లా బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్‌ మాట్లాడారు. ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం తబ్లీగీ జమాత్‌ వంటి సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అటువంటి కార్యక్రమాలతో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరగదని.. ఆరు గ్యారెంటీలు సహా హామీలన్నీ నెరవేరిస్తేనే సర్కారు గౌరవం పెరుగుతుందని పేర్కొ న్నారు. కులగణన పేరుతో సేకరించిన సమాచారాన్ని అర్బన్‌ నక్సల్స్‌ చేతిలో పెట్టారని.. అలా చేస్తే ప్రజల ఆస్తులు భద్రంగా ఉంటాయా..? దోపిడీకి గురవుతాయా..? ఆలోచించాలన్నారు. ఇప్పటికే విద్యా కమిషన్‌ పేరుతో అర్బన్‌ నక్సల్స్‌ చేతిలో విద్యా వ్యవస్థను పెట్టి, హింసను సృష్టించి, తుపాకీ రాజ్యం చేయాలనుకుంటున్నారని.. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంజయ్‌ అన్నారు.


గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు: ఏలేటి

రుణమాఫీపై కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. నిర్మల్‌ జిల్లాలో ఏ గ్రామంలోనైనా సంపూర్ణంగా రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన రేవంత్‌.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. ఆదివారం బీజేఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడు తూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు ఉత్తుత్తి ఫైట్‌ చేస్తున్నాయన్నారు. కేటీఆర్‌ దుబాయ్‌లో ఏం చేశారో రికార్డులు ఉన్నాయంటున్న సీఎం రేవంత్‌.. వాటిని బయటపెట్టి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.

Updated Date - Mar 17 , 2025 | 04:03 AM