Share News

2025 Bharat Summit: 25, 26 తేదీల్లో భారత్‌ సదస్సు

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:12 AM

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 25, 26 తేదీల్లో ‘భారత్‌ సదస్సు-2025’ నిర్వహించనుంది. ఈ సదస్సులో 100కు పైగా దేశాల నుండి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు.

 2025 Bharat Summit: 25, 26 తేదీల్లో భారత్‌ సదస్సు

  • రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ

  • 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు

  • రాహుల్‌గాంధీ, ఖర్గే కీలకోపన్యాసం

  • రేపు హైదరాబాద్‌ డిక్లరేషన్‌ ఆవిష్కరణ

  • రాష్ట్రంలో పెట్టుబడులపై వివరిస్తాం: భట్టి

  • సదస్సు ఏర్పాట్లపై నేడు సీఎం సమీక్ష

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో అంతర్జాతీయ స్థాయి ‘భారత్‌ సదస్సు-2025’ జరగనుంది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(హెచ్‌ఐసీసీ)లోని నోవాటెల్‌ హోటల్‌లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. దీనికి 100కు పైగా దేశాల నుంచి 450కు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. 100 వరకు ప్రగతిశీల రాజకీయ పార్టీలు, 40-50 మంది వరకు మంత్రులు, మరో 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు రానున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు, నిపుణులు సదస్సులో పాల్గొననున్నారు. సదస్సులో అంతర్జాతీయ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం వంటి అంశాలపై ఉన్నత స్థాయి ద్వైపాక్షిక, సైద్ధాంతిక చర్చలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్యానెల్‌ డిస్కషన్స్‌ ఉంటాయి. 25వ తేదీన ‘హైదరబాద్‌ డిక్లరేషన్‌’ను ఆవిష్కరించనున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కీలకోపన్యాసం చేయనున్నారు. ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా ప్రసంగిస్తారు.


అర్జెంటినా విదేశాంగ మాజీ మంత్రి జోర్జ్‌ టయానా, కొలంబియా కార్మిక శాఖ మాజీ మంత్రి, సెనేటర్‌ క్లారా లోపెజ్‌ ఓబ్రెగాన్‌, స్వీడన్‌ విదేశాంగ మాజీ మంత్రి అన్‌ లిండె, క్యూబా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల హెడ్‌ ఎమిలియో లొజాడా, మలేషియా న్యాయ శాఖ మంత్రి ఎం.కుల సేగరన్‌లతో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు దిగ్విజయ్‌ సింగ్‌, పవన్‌ ఖేరా, సుప్రియా శ్రీనాటె, సల్మాన్‌ ఖుర్షీద్‌, జ్యోతిమణి తదితరులు సదస్సుకు హాజరు కానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు కావడం, అలీన ఉద్యమానికి బీజాలు వేసిన బాండుంగ్‌ సదస్సు 70వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు రోజుల భారత్‌ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామికంగా పెను మార్పులు సంభవిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తుందన్నారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ స్వప్నమైన ‘న్యాయ్‌’ను ప్రతిబింబించేలా ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై చర్చలు ఉంటాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించిన ‘తెలంగాణ రైజింగ్‌’పై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివరిస్తామని తెలిపారు. కాగా.. సదస్సు ఏర్పాట్లపై గురువారం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.


ఇవి కూడా చదవండి

PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు

Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 04:12 AM