సచిన్, విరాట్ కోహ్లీలకు షాక్.. పంజాగుట్ట పీఎస్‌లో
ABN , Publish Date - Mar 24 , 2025 | 09:19 PM
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద సినీ, క్రీడా సెలెబ్రిటీల మీద కూడా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా, సచిన్, విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది.

బెట్టింగ్ యాప్స్ కారణంగా నష్టపోయిన వాళ్లు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మొన్న నెల్లూరుకు చెందిన రాంబాబు అనే వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు. సినిమా హీరోల కారణంగా తాను బెట్టింగ్ ఆడి 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నానంటూ వాపోయాడు. వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశాడు. ఇప్పుడు మరో వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన క్రికెటర్స్, బాలీవుడ్ యాక్టర్స్‌పై ప్రతీకారానికి సిద్ధమయ్యాడు. వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘ క్రికెటర్స్ బాలీవుడ్ యాక్టర్స్‌పై ఫిర్యాదు చేశాను. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కొంతమంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను.
పెద్ద పెద్ద యాడ్స్ చేసి కోట్లు సంపాదిస్తున్న వ్యక్తులపై కూడా కేసులు నమోదు చెయ్యాలి. సచిన్, విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్‌లపై ఫిర్యాదు చేశాను. చిన్న చిన్న వ్యక్తులు కాకుండా పెద్ద వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలి. ఒక సిటిజన్‌గా సామాజిక బాధ్యతతో ఫిర్యాదు చేశాను. నా స్నేహితులు చాలా మంది బెట్టింగ్ యాప్స్ కారణంగా నష్టపోయి ప్రాణాలు కోల్పోయారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పెద్ద పెద్ద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కేసుల భయంతో అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. భయ్యా సన్నీయాదవ్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. హర్ష సాయి ఎక్కడున్నాడో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. దుబాయ్‌లో ఉన్నాడన్న ప్రచారం బాగా జరుగుతోంది.
తప్పు ఒప్పుకున్న శ్యామల..
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కారణంగా యాంకర్ శ్యామలపై ఇది వరకే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత విచారణకు రావాలని ఇదివరకే శ్యామలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఆమె స్పందించలేదు. విచారణకు రాకుండానే కోర్టుకు వెళ్లారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు వెళ్లాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే శ్యామల సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ బోట్
Nagpur Violence: అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేతలపై ముంబై హైకోర్టు స్టే... ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం
Minister Satyakumar: అందుకే డీలిమిటేషన్‌ను తెరపైకి తెచ్చారు.. డీఎంకేపై మంత్రి సత్యకుమార్ యాదవ్ విసుర్లు