Share News

Kaleshwaram project: కాళేశ్వరం డీపీఆర్‌ను మళ్లీ పంపించండి

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:38 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన అదనపు టీఎంసీ నీటి తరలింపు ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ను పరిశీలిస్తామని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది.

Kaleshwaram project: కాళేశ్వరం డీపీఆర్‌ను మళ్లీ పంపించండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ తాజా లేఖ

  • అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై ఊరట

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన అదనపు టీఎంసీ నీటి తరలింపు ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ను పరిశీలిస్తామని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను మళ్లీ పంపించాలని లేఖ రాసింది. కాళేశ్వరంలో అదనపు టీఎంసీ ప్రాజెక్టుకు అనుమతి లేదని, ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని చెప్తూ.. సీడబ్ల్యూసీ ఇటీవలే ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపించింది. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో సీడబ్ల్యూసీ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమగ్రమైన లేఖ రాసింది. ఆ లేఖలోని అంశాలతో సంతృప్తి చెందిన సీడబ్ల్యూసీ.. ప్రాజెక్టు డీపీఆర్‌ను మళ్లీ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.


బెన్‌ఫిట్‌ కాస్ట్‌ రేషియో(ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు, తిరిగి వచ్చే ఆదాయానికి మధ్య నిష్పత్తి) వివరాలను తెలియజేయాలని, ఇందుకు తగిన ఆధారాలను కూడా సమర్పించాలని సూచించింది. ఈ డీపీఆర్‌కు ఆమోదం లభిస్తే... 2021లో కేంద్రప్రభుత్వం జారీచేసిన ప్రాజెక్టుల గెజిట్‌లో ‘అనుమతి లేని ప్రాజెక్టుల జాబితా’లో నుంచి కాళేశ్వరం అదనపు టీఎంసీని తొలగించే అవకాశాలున్నాయి. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ గోదావరి నదీ యాజమాన్యబోర్డు(జీఆర్‌ఎంబీ)కి అప్పగించాలని కోరుతూ 2021 జూలై 15వ తేదీన కేంద్రం గెజిట్‌ జారీ చేసింది. ఆ గెజిట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కాంపోనెంట్‌గా, కాళేశ్వరంలో భాగంగా ఆ తర్వాత చేపట్టిన అదనపు టీఎంసీని మరో కాంపోనెంట్‌గా గుర్తిస్తూ.. అదనపు టీఎంసీకి అనుమతి లేదని కేంద్రం తెలిపింది.

Updated Date - Mar 21 , 2025 | 03:38 AM