Chiranjeevi: వ్యతిరేకతను అధిగమిస్తేనే విజయాలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:39 AM
తాను సంపాయించుకున్నది తన తమ్ముడు పవన్ కల్యాణ్, కుమారుడు రామ్‌చరణ్‌లనేనని అగ్ర నటుడు చిరంజీవి తెలిపారు.
నేను సంపాయించింది పవన్, రామ్‌చరణ్‌నే
ఆప్తా గ్లోబల్ బిజినెస్’ సదస్సులో చిరంజీవి
ఏపీలో సరికొత్త పర్యాటక విధానం తెచ్చాం: మంత్రి దుర్గేశ్
హైదరాబాద్ సిటీ, జనవరి 5(ఆంధ్రజ్యోతి): తాను సంపాయించుకున్నది తన తమ్ముడు పవన్ కల్యాణ్, కుమారుడు రామ్‌చరణ్‌లనేనని అగ్ర నటుడు చిరంజీవి తెలిపారు. వ్యతిరేకతను అధిగమిస్తేనే విజయం దక్కుతుందని యువ పారిశ్రామిక వేత్తలకు ఆయన సూచించారు. గత మూడు రోజులుగా ‘కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్’ ఇతివృత్తంతో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్తా) పెట్టుబడిదారుల ప్రపంచ వ్యాపార సదస్సు(క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్) ముగింపు సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడానికి దమ్ము కావాలని, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆప్తా నిర్మాహకులు కార్యక్రమం నిర్వహించిన తీరు అభినందనీయమన్నారు. ఆప్తా సభ్యుల లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తన చిన్నతనంలో క్రీడాకారుడు కావాలనే లక్ష్యం పెట్టుకున్నానని తెలిపారు. ‘‘చదువుకునే సమయంలోనే కాలేజీలో అనుకోకుండా ‘రాజీనామా’ అనే డ్రామా చేశాను. అది బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చింది. ఆ తరువాత నటనపై ఆసక్తి కలిగి ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరా. ఫొటోలు తీసుకుని ఏ ఆఫీ్‌సకూ వెళ్లలేదు. ఫిలిం ఇనిస్టిట్యూట్ నుంచే నాకు అవకాశాలు వచ్చాయి’’ అని వివరించారు.
సద్వినియోగం చేసుకోండి: కందుల దుర్గేశ్
ఏపీలో వినూత్న పర్యాటక విధానాన్ని తెచ్చామని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. ‘ఆప్తా’ సదస్సు చివరిరోజు ‘అన్‌లాకింగ్ గ్రోత్ అండ్ కల్చరల్ హెరిటేజ్ త్రూ టూరిజం అండ్ హాస్పిటాలిటీ’ అనే అంశంపై చర్చలో మంత్రి దుర్గేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఏపీలో పర్యాటక పరంగా అపార అవకాశాలున్నాయని చెప్పారు. తీర ప్రాంతంలో బీచ్, రిసార్ట్ టూరిజంతో పాటు టెంపుల్, ఎకో, ఎడ్వెంచర్, సాహిత్య టూరిజం ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే మంత్రి పలు విధానాలు గురించి వివరిస్తుండగా, కార్యక్రమ నిర్వాహకులు ప్రసంగాన్ని త్వరగా ముగించాలని కోరడంతో చిన్నబుచ్చుకున్నారు. తనకు ముందుగానే కార్యక్రమ పూర్వాపరాలు చెప్పి ఉంటే త్వరగా ముగించేవాడినన్నారు. అనంతరం వేదిక దిగి వెళ్లిపోయారు. నిర్వాహకులు ఆయనకు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా, ఆయన ప్రాంగణం నుంచి వడివడిగా వెళ్లిపోయారు. లక్ష్మీనారాయణ కూడా మంత్రితో వ్యవహరించిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.