Share News

CM Revanth Reddy: ‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌’పై రేపు సీఎం సమీక్ష

ABN , Publish Date - Mar 23 , 2025 | 05:13 AM

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్‌లో సహాయక చర్యల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు.

CM Revanth Reddy: ‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌’పై రేపు సీఎం సమీక్ష

  • సహాయక చర్యల కోసం రూ.5 కోట్లు విడుదల

  • ప్రమాదం జరిగి నెల.. లభించని కార్మికుల ఆచూకీ

హైదరాబాద్‌/నాగర్‌కర్నూల్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్‌లో సహాయక చర్యల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే సమీక్షకు జాతీయ విపత్తు స్పందన దళాలతోపాటు ఆర్మీ కీలక అధికారులు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌జీఆర్‌ఐ, సింగరేణితోపాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సరిగ్గా నెల క్రితం (గత నెల 22న) ప్రమాదం జరిగి.. 8 మంది చిక్కుకుపోయిన విషయం విదితమే. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా.. గురుప్రీత్‌సింగ్‌(పంజాబ్‌) మృతదేహాన్ని మాత్రమే గుర్తించారు.


ఇప్పటికీ మనోజ్‌కుమార్‌(యూపీ), సందీప్‌ సాహూ, జగ్తా జెస్‌, కీశ్వర్‌ సాహు, సంతోష్‌ సాహూ, అనుజ్‌ సాహూ(జార్ఖండ్‌), సన్నీసింగ్‌(జమ్మూకశ్మీర్‌) ఆచూకీ లభించలేదు. రెవెన్యూ(విపత్తుల యాజమాన్యం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ నెల రోజులుగా టన్నెల్‌ వద్దే ఉండి సహాయక చర్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. అయితే, సోమవారం నిర్వహించనున్న సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం దిశానిర్దేశనం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం రూ.5 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ శనివారం జీవో జారీ చేశారు. కాగా, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది.

Updated Date - Mar 23 , 2025 | 05:13 AM