Cyber Criminal Escape: తెలంగాణ పోలీసులకు సైబర్ నేరగాడు బురిడీ
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:53 AM
ఢిల్లీలో తెలంగాణ పోలీసులను సైబర్ నేరగాడు బురిడీ కొట్టాడు. టాయిలెట్ అని చెప్పి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు, దీంతో తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు
టాయిలెట్ అని చెప్పి పోలీసుల కళ్లుగప్పి పరారీ
ఢిల్లీ పోలీసు స్టేషన్‌లో తెలంగాణ పోలీసుల ఫిర్యాదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ పోలీసులను సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. టాయిలెట్‌కు వెళ్తున్నానని చెప్పి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో చేసేదిలేక తెలంగాణ సీసీఎస్ పోలీసులు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. అమాయకులను మోసం చేసిన ఉత్తరాదికి చెందిన సైబర్ నేరస్తుల ఆట కట్టించేందుకు సీసీఎస్ సీఐ నరేష్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందం ఢిల్లీ కేంద్రంగా సైబర్ ముఠాను వేటాడే పనిలో పడింది. ఎట్టకేలకు ముఠాలో కీలకపాత్ర పోషిస్తున్న దినేశ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏ నేరస్తుడినైనా అదుపులోకి తీసుకుంటే తొలుత అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచి, ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా సొంత రాష్ట్రానికి తరలించాల్సి ఉంటుంది. కానీ పోలీసులు అలా చేయకుండా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తీసుకువచ్చారు. అయితే, అర్ధరాత్రి సమయంలో టాయిలెట్‌కు వెళ్లాలని చెప్పి, పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరారయ్యాడు. నిందితుడుని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.