Share News

కంపెనీ సీఎండీ పేరిట సైబర్‌ నేరగాళ్ల వల

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:39 AM

సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తతతో భారీ సైబర్‌ మోసం నుంచి ఓ కంపెనీ బయటపడింది. సైబర్‌ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు ఓ కంపెనీ అధికారి రూ.1.95 కోట్లు పంపాక జరిగిన మోసాన్ని గుర్తించి సైబర్‌ సెక్యూరిటీ బృందానికి ఫిర్యాదు చేయడంతో ఆ డబ్బును సైబర్‌ నేరగాళ్లు విత్‌డ్రా చేయకుండా నిలువరించగలిగారు.

కంపెనీ సీఎండీ పేరిట సైబర్‌ నేరగాళ్ల వల

  • రూ.1.95 కోట్లు పంపాలంటూ వాట్సా్‌పలో సందేశం

  • డబ్బు పంపిన సదరు కంపెనీ అకౌంట్స్‌ ఆఫీసర్‌

  • లావాదేవీ ఎస్‌ఎంఎ్‌సతో అప్రమత్తమైన సీఎండీ

  • నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు..

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తతతో భారీ సైబర్‌ మోసం నుంచి ఓ కంపెనీ బయటపడింది. సైబర్‌ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు ఓ కంపెనీ అధికారి రూ.1.95 కోట్లు పంపాక జరిగిన మోసాన్ని గుర్తించి సైబర్‌ సెక్యూరిటీ బృందానికి ఫిర్యాదు చేయడంతో ఆ డబ్బును సైబర్‌ నేరగాళ్లు విత్‌డ్రా చేయకుండా నిలువరించగలిగారు. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఫోన్‌ నంబర్‌కు గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఓ వాట్సాప్‌ సందేశం వచ్చింది. ఆ నంబరు వాట్సాప్‌ డీపీలో తమ కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) ఫొటో ఉండటంతో సీఎండీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సదరు అకౌంట్స్‌ అధికారి భావించారు.


కంపెనీకి సంబంధించిన ఒక ప్రాజెక్టు అవసరం నిమిత్తం తాను సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.1.95 కోట్లు బదిలీ చేయాలని మెసేజ్‌ ఉండటంతో అకౌంట్స్‌ అధికారి డబ్బు బదిలీ చేశారు. ఈ లావాదేవీకి సంబంధించిన మెసేజ్‌ కంపెనీ సీఎండీ ఫోన్‌ వచ్చింది. వెంటనే ఆయన అకౌంట్స్‌ విభాగంతో మాట్లాడగా అసలు విషయం తెలిసింది. కంపెనీ సీఎండీ వెంటనే విషయాన్ని నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బ్యాంకు అధికారులను సంప్రదించి బదిలీ అయిన రూ.1.95 కోట్లను సైబర్‌ నేరగాళ్లు విత్‌డ్రా చేయకుండా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Mar 15 , 2025 | 04:39 AM