Share News

KTR : అరెస్టుకు వేళాయెనా..?

ABN , Publish Date - Jan 08 , 2025 | 05:43 AM

ఫార్ములా-ఈ కారు రేసు కేసు విచారణలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు దూకుడు పెంచారు. కేటీఆర్‌ విచారణకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను సేకరిస్తున్నారు. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు కేసులో దర్యాప్తు

KTR : అరెస్టుకు వేళాయెనా..?

నిధుల దుర్వినియోగం కనిపిస్తోందన్న హైకోర్టు.. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

ఫార్ములా-ఈ.. రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్‌

ఆయన అరెస్టుకు మార్గం సుగమం!.. నేడు హాజరవనున్న అర్వింద్‌కుమార్‌

లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలి.. నేడు హైకోర్టులో కేటీఆర్‌ పిటిషన్‌

గ్రీన్‌ కో కార్యాలయాలకు ఏసీబీ.. హైదరాబాద్‌, మచిలీపట్నంలో తనిఖీలు

కీలక రికార్డుల స్వాధీనం! ఏసీబీ ఆఫీసుకు బంజారాహిల్స్‌ పోలీసులు..

16న విచారణకు రండి.. కేటీఆర్‌కు ఈడీ సమన్లు

హైదరాబాద్‌/మచిలీపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసు విచారణలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు దూకుడు పెంచారు. కేటీఆర్‌ విచారణకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను సేకరిస్తున్నారు. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేయడంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైనట్లేనని భావిస్తున్నారు. గురువారం కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో బీఆర్‌ఎస్‌ నేతలు తమ లీగల్‌ టీంతో చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేటీఆర్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కేవియట్‌ దాఖలు చేసింది. దీంతో ఆయనకు అరెస్టు నుంచి రక్షణ లభించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫార్ములా-ఈ రేసు తొలి ఒప్పందంలో స్పాన్సరర్‌గా ఉన్న ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, దాని మాతృ సంస్థ గ్రీన్‌ కో కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఏపీ, తెలంగాణలో మొత్తం ఆరు చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌లో; మచిలీపట్నంలోని కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. మచిలీపట్నంలోని గ్రీన్‌కో సంస్థ ఎండీ చలమలశెట్టి సునీల్‌ ఇంట్లో గ్రీన్‌కో, ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ కార్యాలయాలను నడుపుతున్నారు. స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఇవ్వకుండా తెలంగాణ ఏసీబీ అధికారులు ఈ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ పనిచేసే సిబ్బందిని మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. కార్యాలయంలోని కీలక రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫార్మలా-ఈ కారు రేసు కేసులో భాగంగానే గ్రీన్‌కో కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు మచిలీపట్నంలో చెప్పారు. ప్రతి అంశాన్ని పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు.

నేడు ఏసీబీ ముందుకు అర్విందకుమార్‌..

ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి కీలక వ్యవహారాలు చక్కదిద్దిన నాటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్విందకుమార్‌ను బుధవారం ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కేటీఆర్‌ను విచారించడానికి ముందే అర్విందకుమార్‌ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఎఫ్‌ఈవో, ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, పురపాలక శాఖకు మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండగా.. రెండోసారి స్పాన్సరర్‌ను తప్పించి పురపాలక శాఖ, ఎఫ్‌ఈవో ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది? తొలి ఒప్పందంలో భాగంగా రెండో సెషన్‌కు స్పాన్సరర్‌ కంపెనీ ఫీజు చెల్లించాల్సి ఉండగా ఎవరి ఆదేశాలతో హెచ్‌ఎండీఏ నుంచి రూ.46 కోట్లు విదేశీ కరెన్సీలో చెల్లించారు? అనే విషయాలపై అర్విందకుమార్‌ నుంచి వివరాలు సేకరించనున్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారతానంటూ ఇప్పటికే ఆయన ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన క్రమంలో విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో తెర ముందు, వెనక జరిగిన విషయాలు బయటపెడితే మాత్రం కేటీఆర్‌ అరెస్టు మరింత సులభం అవుతుంది. అర్విందకుమార్‌ అప్రూవర్‌గా మారితే ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చు. '


16న విచారణకు రండి: ఈడీ

ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి ఫెమా నిబంధనల ఉల్లంఘన ప్రకారం దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు కేటీఆర్‌ను ఈ నెల 16న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డిని బుధవారం ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఒకసారి ఈడీ నుంచి సమయం కోరిన బీఎల్‌ఎన్‌ రెడ్డి, నేటి విచారణకు తప్పనిసరిగా హజరు కావాల్సిందేనని, ఆయన మరోసారి సమయం కోరితే మాత్రం తదుపరి చట్టపరమైన చర్యలకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

న్యాయవాదిని అనుమతించకపోవడంపై హైకోర్టుకు..న్యాయవాదితో కలిసి ఏసీబీ విచారణకు అనుమతించకపోవడంపై బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. తన విచారణ న్యాయవాదుల సమక్షంలో జరిగేలా చూడాలని కోరతానన్నారు.

ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్‌ పోలీసులు..

ఫార్ములా-ఈ కారు రేసు దర్యాప్తులో విచారణలు, అరెస్టులు ప్రారంభం కానున్న క్రమంలో బంజారాహిల్స్‌ సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులు మంగళవారం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఏసీబీ ఉన్నతాధికారుల నుంచి వారికి కొన్ని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. కేటీఆర్‌ తదితరుల విచారణ సమయంలో బందోబస్తుపై, ఒకవేళ అరెస్టులు జరిగితే అవసరమైన ఎస్కార్టు గురించి ఏసీబీ నుంచి పోలీసులకు సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ కమిషనర్‌తో కూడా ఏసీబీ ఉన్నతాధికారులు మాట్లాడినట్లు సమాచారం.

Updated Date - Jan 08 , 2025 | 05:44 AM