Electric vehicle: కాలుష్య నివారణకు విద్యుత్ వాహన పాలసీ
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:44 AM
కాలుష్య నివారణకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో విద్యుత్ వాహన పాలసీని తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో జువ్వాడి చొక్కారావు ట్రాఫిక్ అవగాహన పార్కును మంత్రి ప్రారంభించారు.

296 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు
కేసీఆర్‌పై నర్సారెడ్డి పోరాటానికి సంపూర్ణ మద్దతు: మంత్రి పొన్నం
తిమ్మాపూర్, గజ్వేల్, శామీర్‌పేట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : కాలుష్య నివారణకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో విద్యుత్ వాహన పాలసీని తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో జువ్వాడి చొక్కారావు ట్రాఫిక్ అవగాహన పార్కును మంత్రి ప్రారంభించారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీ ద్వారా వాహనాల ఫిట్‌నె్‌సను నిర్ధారించేందుకు రూ.296కోట్లతో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన స్ర్కాప్ విధానం ద్వారా 15 సంవత్సరాలు దాటిన వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తే రాయితీ ఇస్తామన్నారు. కాగా కేసీఆర్‌పై గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పొన్నం ప్రకటించారు.
నర్సారెడ్డి చేపట్టిన పాదయాత్ర నాలుగో రోజు మంత్రి మార్గం మధ్యలో సంఘీభావం తెలిపి, మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, వివిధ శాఖల్లో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆయన హుస్నాబాద్‌లోని ఐకేపీ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై ఆదివారం జరిగిన సమీక్షలో మాట్లాడారు. కాగా నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంక్షారెడ్డి చేపట్టిన పాదయాత్రకు శామీర్‌పేటలోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మద్దతు తెలిపారు.