Harish Rao: తిట్ల పోటీ పెడితే రేవంత్‌కే ఫస్ట్‌ప్రైజ్
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:27 AM
హైదరాబాద్‌లో అందాలు పోటీలు పెడుతున్న ప్రభుత్వం.. అబద్ధాలు, తిట్ల పోటీలు కూడా పెడితే అందులో ముఖ్యమంత్రికే మొదటి బహుమతి వస్తుందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
అసలు నువ్వు మనిషివా? పశువువా?.. కేసీఆర్‌కు
క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్ ముసుగేసుకున్న బీజేపీ వ్యక్తివి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం
కేటీఆర్‌తో విభేదాల్లేవని పునరుద్ఘాటన
రేవంత్‌ను గద్దె దించేందుకే పోటీపడుతున్నామని వ్యాఖ్య
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అందాలు పోటీలు పెడుతున్న ప్రభుత్వం.. అబద్ధాలు, తిట్ల పోటీలు కూడా పెడితే అందులో ముఖ్యమంత్రికే మొదటి బహుమతి వస్తుందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్.. ఆ మాటను మార్చి బీఆర్‌ఎస్ పార్టీని అన్నానని చెప్పడం హాస్యాస్పదమని హరీశ్ అన్నారు. సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాక కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చూస్తే ఆయన కాంగ్రెస్ ముసుగేసుకున్న బీజేపీ వ్యక్తిని అర్థమైందన్నారు. ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీశ్ కొట్టుకుంటున్నారని సీఎం చెప్పిన మాటలను కొట్టిపారేశారు. రాష్ట్రానికి శనిలాంటి సీఎం రేవంత్‌రెడ్డిని గద్దె దించేందుకు తాను, కేటీఆర్ పోటీపడి పనిచేస్తామని చెప్పారు. జర్నలిస్టులను పట్టుకొని బట్టలూడదీసి రోడ్డుమీద కొడతామన్న రేవంత్ రెడ్డి భాష జుగుప్సాకరంగా ఉందని అన్నారు. సీఎం భాషను మార్చుకోవాలని హితవు పలికారు. సీఎంకే కాదు ఎదుటివారికి భార్యాబిడ్డలు, కుటుంబాలు ఉంటాయని, తనదాకా వస్తే కానీ సీఎంకు తెలియలేదా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను కాల్చిపారేయాలని, ప్రగతిభవన్‌ను పేల్చేయాలని, అలాగే కేటీఆర్ కుమారుడిని ఉద్దేశించి అన్న మాటలను, తన(హరీశ్‌రావు) ఎత్తుపై సీఎం రేవంత్ గతంలో అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసిన హరీశ్‌రావు.. అసలు నువ్వు మనిషివా..? పశువువా..? అంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేయాలన్న కాంగ్రెస్ ఇప్పుడు రుసుము చెల్లించాలని పేదలను వేధిస్తోందని ఆరోపించారు. ఫార్మాసిటీ భూములను రైతులకు తిరిగివ్వాలని, లేదంటే ఫార్మాసిటీని నిర్మించి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వాన్ని బండకేసి కొట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేసిందని హరీశ్ తెలిపారు. మధిర, కొడంగల్, సిద్దిపేట ఎక్కడైనా సరే వందశాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే ముక్కునేలకు రాస్తానని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి సవాల్ చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగాలివ్వలేదని అసత్యాలు చెబుతున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఉద్యోగాల కల్పనపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే గ్రూప్-1, 2, 3 పోస్టుల భర్తీలో అచ్చంగా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఆరేడు వేలకు మించదని అన్నారు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియను తన గొప్పగా చూపెట్టేందుకు సీఎం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
మేం చేసిన అప్పు 4,17,496 కోట్లు
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన అప్పులు రూ.4,17,496 కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ అంశంలో సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం ఆపాలని సూచించారు. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబరు 7వరకు ప్రభుత్వం తీసుకున్న ఎఫ్‌ఆర్‌బీఎం, ప్రభుత్వ గ్యారెంటీ రుణాల వివరాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 2024 మార్చి 31నాటికి మొత్తం ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.3,89,673 కోట్లు అని హరీశ్ తెలిపారు. అందులో 2014 జూన్ 2నాటికి రూ.72,658 కోట్లు ఉన్నాయని, అలాగే, 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి31 మధ్య ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోని రుణాలు రూ.15,118కోట్లు తీసుకున్నట్లు చెప్పారు. దీనిప్రకారం బీఆర్‌ఎస్ పాలనలో రూ.3,01,897కోట్లే ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలుగా తీసుకున్నామని వివరించారు. అదే విధంగా 2014 జూన్2 నుంచి 2023 డిసెంబరు7 మధ్య ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకున్న అప్పులు రూ.1,15,59 కోట్లు అని ఈ మొత్తం కలిపి బీఆర్‌ఎస్ హయాంలో రూ.4,17,496కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు ఆయన వివరించారు. ఇక, కాంగ్రెస్ అధికారం చేపట్టాక 2023 డిసెంబరు 7 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ గ్యారెంటీతో రూ.1,27,208కోట్లు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రూ.15,118కోట్లు అప్పు చేశారన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే బయట పెడతానని హరీశ్‌రావు పేర్కొన్నారు.