Harish Rao: కోర్టులో అంశం.. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి తీర్పు
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:28 AM
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడడాన్ని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై అసెంబ్లీలో మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల అనర్హతపై సభలో సీఎం వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధం..
సీఎం వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం: హరీశ్
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడడాన్ని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై అసెంబ్లీలో మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీలో బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హులు కారు, ఉప ఎన్నికలు రానేరావంటూ సభలో సీఎం జడ్జిమెంట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. సభలో సీఎం మాట్లాడింది అసెంబ్లీ, పార్లమెంటు వ్యవస్థ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాలను చట్టసభల్లో మాట్లాడకూడదని కౌల్ అండ్ శకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్‌లో స్పష్టంగా ఉందని వివరించారు.
ముఖ్యమంత్రి తన పరిధిని దాటి సుప్రీంకోర్టులో ఉన్న విషయంపై మాట్లాడడం అసెంబ్లీ ప్రివిలేజ్ కిందకు వస్తుందని హరీశ్ పేర్కొన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద ఈ విషయాన్ని తాను చెప్పే ప్రయత్నం చేేస్త మధ్యలో మైక్ కట్ చేశారని ఆరోపించారు. కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా హరీశ్ వెల్లడించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేస్తూ జీఓ తెచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్‌ని నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు. డీజీపీ అధికారికంగా విడుదల చేసిన లెక్క ప్రకారం గతేడాది కంటే ఈసారి 23శాతం క్రైమ్ రేట్ పెరిగిందని, 15 నెలల్లో 9 మతసంబంధ అల్లర్లు జరిగాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు అత్యాచార ఘటనలు రెండు హత్యలు జరిగాయన్నారు. హైదరాబాద్‌లో 50శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, సీసీ కెమెరాల నిర్వహణలోనూ ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపణ చేశారు.