Share News

Harish Rao: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే

ABN , Publish Date - Jan 22 , 2025 | 05:52 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ‘మంగళవారం నుంచి పలు పథకాలపై నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది. మీ సోకాల్డ్‌ ప్రజాపాలనపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా?’ అని ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో ప్రశ్నించారు.

Harish Rao: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే

ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్‌

ప్రజలు ఉద్యమించక ముందే కళ్లు తెరవండి

మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ‘మంగళవారం నుంచి పలు పథకాలపై నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది. మీ సోకాల్డ్‌ ప్రజాపాలనపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా?’ అని ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో ప్రశ్నించారు. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్‌ అని అర్థమవుతున్నదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామసభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణమని, లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి.. అరెస్టులు చేసి నోళ్లు మూయించాలని చూస్తున్నారు. ఇప్పుడు యావత్‌ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తోంది.. అడుగడుగునా ప్రశ్నిస్తోంది. ఇప్పుడు వారిపై ఎన్నికేసులు పెడతారు. ఎంతమందిని అరెస్టులు చేస్తారు’ అని ప్రశ్నించారు. అందరికీ సంక్షేమ పథకాలిస్తామని ఇప్పుడు భారీగా కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ రాక్షస పాలనలో విసిగి, వేశారి పోయిన ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవాలని సూచించారు.


సీఎం, మంత్రి చెప్పింది అబద్ధం

కృష్ణాజలాల వాటాకు సంబంధించి గత ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ సహా ఆ పార్టీ నేతలు చెప్పింది.. పచ్చి అబద్ధమని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వెల్లడించిన సమాచారంతో తేటతెల్లమైందని హరీశ్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్న 34-66 శాతం ఒకే సంవత్సరానికి అని, పరివాహక ప్రాంతం ప్రకారం తెలంగాణకు 71 శాతం నీటి కేటాయింపులు జరగాలని కేసీఆర్‌ ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్‌ను కోరిందని స్పష్టం చేయడం విమర్శలు చేస్తున్న వారి నోళ్ళు మూయించే సమాధానమన్నారు. నీటివాటాలు తేల్చేవరకు 50-50 శాతం కేటాయించాలని 2015లో తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు కృష్ణాబోర్డు ముందు తేల్చడం వంటివి దాచేస్తే దాగని సత్యాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్‌ 89 పెట్టి, రాష్ట్రాల బదులు.. ప్రాజెక్టుల ఆధారంగా నీటి పంపిణీ జరిగేలా చేసింది.. కృష్ణా, గోదావరి బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీనే అని ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Updated Date - Jan 22 , 2025 | 05:52 AM

News Hub