Share News

బీసీ బిల్లులపై వాడీవేడి చర్చ

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:42 AM

బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులపై అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుల్లో మూడు సవరణలు చేయాలని బీఆర్‌ఎస్‌ ప్రతిపాదించగా, ఆయా అంశాలను కేంద్రానికి పంపే బిల్లుల్లో పెట్టడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది.

బీసీ బిల్లులపై వాడీవేడి చర్చ

  • మూడు సవరణలు చేర్చాలన్న హరీశ్‌రావు

  • కేంద్రానికి పంపే బిల్లుల్లో సవరణలు వద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

  • మొండికేయవద్దని బీఆర్‌ఎస్‌ హితవు బిల్లులకు మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌, బీజేపీ

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులపై అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుల్లో మూడు సవరణలు చేయాలని బీఆర్‌ఎస్‌ ప్రతిపాదించగా, ఆయా అంశాలను కేంద్రానికి పంపే బిల్లుల్లో పెట్టడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. బీసీ రిజర్వేషన్‌ పెంపు బిల్లులపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో తొలుత హరీశ్‌రావు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుందని, పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరిగితే తమ నలుగురు ఎంపీలు బిల్లులకు అనుకూలంగా ఓటేస్తారని పేర్కొన్నారు. అయితే, ఈ బిల్లుల్లో మూడు అంశాలను చేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు సబ్‌ ప్లాన్‌ను ప్రకటించడంతోపాటు రూ.20వేల కోట్లు కేటాయించాలని కోరారు.


బిల్లుల విషయంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామంటే.. కలిసి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. హరీశ్‌ ప్రతిపాదించిన సవరణలపై మంత్రి పొన్నం అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రానికి పంపే బిల్లుల్లో హరీశ్‌రావు ప్రతిపాదించిన అంశాలను ఎలా పెడతాం? అని నిలదీశారు. బీసీ బిల్లులపై మొండికేయవద్దని హితవు పలికారు. అంతకుముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణనను శాస్త్రీయంగా పూర్తి చేసినప్పుడే..పార్లమెంట్‌లోనూ బీసీ బిల్లులకు ఆమోదం లభిస్తుందని, ఈ విషయంలో కాంగ్రెస్‌ చిత్తశుద్ధి చాటుకోవాలని సూచించారు. బీసీ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్‌ తెలిపారు.

Updated Date - Mar 18 , 2025 | 03:42 AM