Betting App: ఆ హీరోల వల్లే 80 లక్షలు పోగొట్టుకున్నా.. వారిని శిక్షించాల్సిందే..
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:42 PM
గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి, ప్రస్తుతం చేస్తున్న వారికి తెలంగాణ పోలీసు శాఖ చుక్కలు చూపిస్తోంది.పెద్ద పెద్ద సినిమా స్టార్లను కూడా వదలటం లేదు.తొక్కినార తీస్తోంది.

తెలంగాణ పోలీసుల పుణ్యమా అని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటేనే గజగజ వణికేలా పరిస్థితి తయారైంది. గతంలో పెద్ద పెద్ద సినిమా స్టార్లు కూడా బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్లు చేశారు. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌తో పాటు మరికొంతమంది ఈజాబితాలో ఉన్నారు. వీరిలో చాలా మందిపై ఇప్పటికే పోలీసు కేసులు నమోదయ్యాయి. తెలంగాణ పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలతో బెట్టింగ్ యాప్స్ కారణంగా డబ్బులు నష్టపోయిన వారికి ధైర్యం వస్తోంది. ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తమ గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా, నెల్లూరుకు చెందిన రాంబాబు అనే వ్యక్తి మీడియాతో ముఖాముఖి మాట్లాడాడు. సినిమా స్టార్ల ప్రమోషన్ల వల్ల బెట్టింగ్ ఆడి లక్షలు పోగొట్టుకున్నట్లు వాపోయాడు.
అతడు మీడియాతో మాట్లాడుతూ.. ‘ బెట్టింగ్ యాప్‌ల ద్వారా 80 లక్షలు పోగొట్టుకున్నా. హీరోల ప్రమోషన్ చూసే నష్టపోయా. నేను బెట్టింగ్ యాప్‌లో పాల్గొని తప్పు చేశాను. నాకు ఏ శిక్ష పడ్డా పర్వాలేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు శిక్ష వేయాల్సిందే. ఐపీఎస్ అధికారి సజ్జనార్ చొరవ తీసుకోవడంతో బెట్టింగ్ యాప్‌ల బాగోతం బయటకు వచ్చింది. బెట్టింగ్ యాప్ బాధితులు దేశవ్యాప్తంగా ఉన్నారు. సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లు యాప్స్‌ను ప్రమోట్ చేయడం వల్లే బెట్టింగ్ ఆడుతున్నారు. సిటీస్‌లో కంటే పల్లెటూర్లలో ఈ బెట్టింగ్ చాప కింద నీరులా విస్తరించింది. నేను 65 లక్షలు అప్పు చేసి మరీ బెట్టింగ్ పెట్టాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
తప్పును తెలుసుకున్నా: ప్రకాష్ రాజ్
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయటంపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను 2016లో ఆ యాడ్ చేశానన్నారు. కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ యాడ్ చేయటం తప్పని తెలుసుకున్నానన్నారు. 2017లో యాడ్ ఒప్పందాన్ని పొడిగిస్తామని యాడ్ సంస్థ వారు తనను కోరినా తిరష్కరించినట్లు తెలిపారు. యాడ్‌ను ప్రసారం చేయవద్దని కూడా కోరినట్లు వెల్లడించారు. 9 ఏళ్ల కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశానన్నారు. 2021లో ఆ సంస్థను వేరే సంస్థకు అమ్మేశారని, కొత్త సంస్థ తన యాడ్‌ను మరో సారి సోషల్ మీడియాలో వాడిందని అన్నారు. తన ప్రకటన వాడినందుకు లీగల్ నోటీసులు పంపానని వెల్లడించారు. తెలంగాణ పోలీసులు తనను విచారణకు పిలిస్తే.. వెళ్లి వివరణ ఇస్తానని అన్నారు.
ఇవి కూడా చదవండి:
Crime News: ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యం
Harish Rao On Budget: ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా.. అసెంబ్లీలో సర్కార్‌పై హరీష్ ఫైర్