గాలి వస్తే మంటలే
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:45 AM
నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులో ఉన్న 35వ వార్డులోని పద్మానగర్‌లో సమస్యలు తిష్ట వేశాయి.
గాలి వస్తే మంటలే
పద్మానగర్‌లో భయంకరంగా విద్యుతతీగలు
భయాందోళనకు గురవుతున్న స్థానికులు
ఓపెన డ్రైనేజీ అవుట్ లెట్ లేక ఇక్కట్లు
పరిష్కరించాలని కాలసీవాసుల వినతి
నల్లగొండ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులో ఉన్న 35వ వార్డులోని పద్మానగర్‌లో సమస్యలు తిష్ట వేశాయి. విద్యుత తీగల సమస్యలతో పాటు డ్రైనేజీతో ఇబ్బందులు పడుతున్నారు. సబ్‌స్టేషన వెనక ప్రాంతంలో 33/11 కేవీ మెయిన తీగలకు కొన్ని పిచ్చి మొక్కలతో పాటు పలు మొక్కలకు సంబంధించిన తీగలు చుట్టుకొని పలుమార్లు గాలిదుమారం వచ్చినప్పుడల్లా మంటల చెలరేగుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సబ్‌స్టేషన పక్కన, వెనక అనేక నివాస గృహాలు ఉన్నాయి. ఈ మెయిన తీగలకు తిప్ప తీగలతో పాటు ఇతర మొక్కలకు చెందిన తీగలు భారీగా పెరిగి కరెంట్ తీగలకు అల్లుకున్నాయి. స్థానిక ప్రజలతో పాటు ఆ వార్డు కౌన్సిలర్ అనేక సార్లు విద్యుత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఎల్‌సీ తీసుకొని కరెంట్ తీగలకు ఉన్న చెట్లను తొలగించాల్సిన విద్యుత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పద్మానగర్‌లోని ఈ సబ్‌స్టేషన వెనక ఉన్న ప్రాంతం తమది కాదంటే తమదు కాదని విద్యుతశాఖకు చెందిన టౌన -2 అధికారులతో పాటు రూరల్ అధికారులు పేర్కొనడం గమనార్హం. ఆ ప్రాంతం ఏ అధికారి కింద ఉందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉరుములు, మెరుపులు వస్తే కరెంట్ తీగల నుంచి వచ్చే మంటలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైటెన్షన వైర్లకు మొక్కల తీగలు అలుముకుంటే అధికారులు పట్టించుకోక పోవడంతో వర్షం వచ్చినప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి.
అద్దె ఇంట్లో ఉండి చనిపోతే కర్మ కార్యక్రమాలకు...
అద్దె ఇంట్లో నివసిస్తూ ఉన్న నిరుపేదలు ఎవరైనా చనిపోతే వారి దశదినకర్మ కార్యక్రమాలు చేయడానికి అనేక సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితులు ఆ కాలనీలో అనేకం ఉన్నాయి. కొందరూ ఏకంగా శ్మశానవాటికలోనే 10వ రోజు కర్మ కార్యక్రమాలు నిర్వహించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంటి యజమానులు మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిని దహన సంస్కారాలు కూడా నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. 35వ వార్డులో కార్మికులు అ ధికంగా ఉన్నందున వారికి స్థలం కేటాయించి భవన నిర్మాణం చేయించి కర్మ కార్యక్రమాలు నిర్వహించుకునేలా చూడాలని కోరుతున్నారు.
ఆ ప్రాంతం మా పరిధిలో లేదు
సబ్‌స్టేషన వెనక ఉన్న ప్రాంతం తమ పరిధిలో లేదని టూటౌన ఏఈ రవీందర్ పేర్కొనగా తాను రూరల్ ఏఈ అని షరీఫ్ పేర్కొంటూ ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదన్నారు. ఇద్దరు ఏఈలు తమది కాదంటే తమది కాదని చెబుతున్నారు. దీంతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మంటలు వచ్చినప్పుడ ల్లా భయాందోళనకు గురవుతున్నారు.
అవుట్ లెట్ లేక మురుగునీటి నిల్వలు
35వ వార్డులో ఓపెన డ్రైనేజీకి సంబంఽధించి నీటి నిల్వల ను డ్రైనేజీ కలపకపోవడం, అవుట్ లెట్ లేకపోవడంతో పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న మురు గునీటి వల్ల దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో దోమలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా పందులు సైతం స్వైరవిహారం చేస్తున్నాయి. మునిసిపల్ అధికారులకు ఈ విషయంపై తెలియజేసినా ఓపెన డ్రైనేజీకి సంబంధించి అవుట్‌లెట్ సమస్యను పరిష్కరించడం లేదు. నాలుగేళ్లుగా స్థానికులు అధికారుల చుట్టూ తిరిగిన ఏ మాత్రం స్పందించడం లేదని సమాచారం. కౌన్సిల్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించి నా అధికారులు చర్యలు తీసుకోలేదని కౌన్సిలర్ తెలిపారు.
వార్డు సమస్యలను పరిష్కరించాలి
35వ వార్డులో సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నిరుపేదలు అధికంగా ఉండే తమ కాలనీకి ఇళ్లను కూడా మంజూరు చేయాలి. సబ్‌స్టేషన వెనక ఉన్న ప్రాంతంలో కరెంట్ తీగలకు ఉన్న చెట్లను తొలగించి మంటలు రాకుండా చూడాలి. అదేవిధంగా డ్రైనేజీ అవుట్‌లెట్ లేకపోవడంతో మురుగు నీటి నిల్వలు ఉండి సమస్యలు ఏర్పడుతున్నాయి. వెంటనే సమస్యలను పరిష్కరించాలి.
గుర్రం ధనలక్ష్మి, కౌన్సిలర్