Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
ABN , Publish Date - Jan 22 , 2025 | 05:30 AM
సాధారణ శస్త్రచికిత్సలకు అనుమతులు తీసుకొని, గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేస్తున్న ఆస్పత్రి గుట్టురట్టయింది. ఆరు నెలల క్రితం ఆస్పత్రిని ప్రారంభించిన వైద్యులు ఇతర రాష్ట్రాల రోగులను, కిడ్నీ దాతలను నగరానికి రప్పించి నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.

ఇతర రాష్ట్రాల రోగులకు కిడ్నీ మార్పిడి
సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో సర్జరీలు
ఆస్పత్రిని సీజ్ చేసిన వైద్యాధికారులు
హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సాధారణ శస్త్రచికిత్సలకు అనుమతులు తీసుకొని, గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేస్తున్న ఆస్పత్రి గుట్టురట్టయింది. ఆరు నెలల క్రితం ఆస్పత్రిని ప్రారంభించిన వైద్యులు ఇతర రాష్ట్రాల రోగులను, కిడ్నీ దాతలను నగరానికి రప్పించి నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకనంద మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఈ దందా జరుగుతోంది. అలకనంద ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్, సాధారణ శస్త్రచికిత్సల నిర్వహణకు సుమంత్ గట్టుపల్లి.. రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ నుంచి అనుమతి తీసుకున్నారు. జూలై 2024లో 9 పడకలతో హాస్పిటల్‌ను ప్రారంభించారు. కానీ, ఆస్పత్రి నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ డబ్బు దండుకుంటున్నారు. అలకనంద ఆస్పత్రిలో కిడ్నీల దందా కొనసాగుతోందని మంగళవారం రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు అందింది. వెంటనే ఆయన వైద్యాధికారులు, పోలీసులతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులను చూసిన వైద్యులు పరారయ్యారు. తమిళనాడుకు చెందిన నస్రీనా బాను, ఫిర్దోజ్ బేగం నుంచి కిడ్నీలు తీసుకొని కర్ణాటకకు చెందిన బీఎస్ రాజశేఖర్, కృపాలతకు ఈ నెల 17న అమర్చినట్లు తేలింది. ఆ నలుగుర్ని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నిర్వాహకుడు సుమంత్‌ను అరెస్ట్ చేశారు. కిడ్నీ మార్పిడి చేసి, పరారైన వైద్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన ఆస్పత్రిని సీజ్ చేసినట్లు డీఎంహెచ్‌వో చెప్పారు.
కిడ్నీ రాకెట్‌పై మంత్రి దామోదర ఆరా
కిడ్నీ మార్పిడి రాకెట్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. ఇందులో ప్రమేయం ఉన్న వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యాన్ని ఉపేక్షించొద్దని, క ఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే