రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తులు వెల్లువ
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:48 AM
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో భారీ స్పందన వచ్చింది.
జగిత్యాల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో భారీ స్పందన వచ్చింది. నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో భారీగా దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు సర్వర్ సమస్యలు తలెత్తినా ప్రజాపాలన కేంద్రాలు, మీసేవా కేంద్రాల వద్ద క్యూలైన్ కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు సబ్సిడీపై రుణాలు అందించనుంది. మొదట ఈ నెల5 వరకు గడువు నిర్ణయించారు. సర్వర్ సమస్యలు, దరఖాస్తుదారులు కుల, ఆదాయ ఇతర ధ్రువీకరణ పత్రాలు పొందడంలో తీవ్ర జాప్యం జరగడం.. అలాగే ఏ యూనిట్‌కు దరఖాస్తు చేసుకుంటే ఎంత మొత్తం రుణం మంజూరు చేస్తారో నిర్ణయం కాకపోవడంతో చాలామంది దరఖాస్తు చేసుకునేందుకు వెనుకడుగు వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం గడువును ఈనెల 14 వరకు పొడగించింది. గడువు ముగిసే వరకు జిల్లాలో 47,787 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
అదృష్టం ఎవరికో....
రాజీవ్ యువ వికాసం పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో అదృష్టం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువతతో పాటు పలువురు రైతులు మండల కేంద్రాలతో పాటు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవాకేంద్రాల్లో కూడా దరఖాస్తులు సమర్పించారు. ఇటీవల వరుసగా సెలవులు వచ్చినా ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఈ కేంద్రాలను తెరిచి ఉంచారు. మున్సిపల్, మండల కమిటీలు దరఖాస్తులను పరిశీలించి జిల్లా కమిటీకి సమర్పించనున్నారు. జిల్లా కమిటీలోని సభ్యులు జాబితాను పరిశీలించి అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు.
బీసీ కార్పోరేషన్‌లో నిర్ణయం కానీ యూనిట్ల లక్ష్యం..
బీసీ సంక్షేమ, కార్పోరేషన్ శాఖలో యూనిట్ల లక్ష్యం ఇంకా నిర్ణయం కాలేదు. జిల్లావ్యాప్తంగా బీసీ కార్పోరేషన్ కింద యూనిట్లను పొందడానికి 31,128 దరఖాస్తులు వచ్చాయి. బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ కింద 6,749 దరఖాస్తులు, ఎంబీసీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కింద 444, వాషర్‌మెన్ కో ఆపరేటివ్ సొసైటీ కింద 903, వడ్డెర కార్పోరేషన్ కింద 592, ట్యాడీ టాపర్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ కింద 2,669, సాగర కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ కింద రెండు, వాల్మీకి, బోయ కార్పోరేషన్, కో ఆపరేటివ్ సొసైటీస్ 201, క్రిష్ణ బలిజ, పూసల సొసైటీ కింద 270 దరఖాస్తులు వచ్చాయి. విశ్వ బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ 3,149, కుమ్మరి సొసైటీస్ కింద 826, మేదరి ఫైనాన్స్ కార్పోరేషన్ కింద 483, ముదిరాజ్ కో ఆపరేటివ్ సొసైటీ కింద 1,664, గంగపుత్ర కో ఆపరేటివ్ సొసైటీ కింద 1,227, మున్నూరు కాపు కార్పోరేషన్ కింద 2,885, లింగాయత్ కో ఆపరేటివ్ సొసైటీ కింద 20, యాదవ కో ఆపరేటివ్ సొసైటీ కింద 1,773, మేర కో ఆపరేటివ్ సొసైటీ కింద 413, పద్మశాలీ కార్పోరేషన్, కో ఆపరేటివ్ సొసైటీ కింద 3,911, పెరిక కో ఆపరేటివ్ సొసైటీ కింద 461, ఈబీసీ వేల్ఫేర్ బోర్డు కింద యూనిట్లు పొందడానికి 1,074 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
సద్వినియోగం చేసుకోవాలి
- బీఎస్ లత, అదనపు కలెక్టర్
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే యూనిట్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాము. వేరిఫికేషన్ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేస్తాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలకు సంబంధించి యూనిట్లు ప్రభుత్వం నుంచి మంజూరవుతాయి.
జిల్లాలో వివిధ కార్పోరేషన్లలో లక్ష్యాలు...దరఖాస్తులు
కార్పోరేషన్ పేరు యూనిట్ల లక్ష్యం వచ్చిన దరఖాస్తుల సంఖ్య
ఎస్‌సీ 4,402 11,300
ఎస్‌టీ 674 1,437
మైనారిటీ. 764 3,922
బీసీ ఇంకా నిర్ణయించలేదు 31,128
-------------------------------------------------------------------------------------
మొత్తం (బీసీ మినహా) 5,840 47,787
-------------------------------------------------------------------------------------