రైతుల సంక్షేమం కోసమే భూభారతి
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:13 AM
రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ మండలం దుర్శేడ్ రైతు వేదికలో, కొత్తపల్లి పట్ణణంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
కరీంనగర్ రూరల్/భగత్‌నగర్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ మండలం దుర్శేడ్ రైతు వేదికలో, కొత్తపల్లి పట్ణణంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై అవగాహన కల్పించారు. ధరణి చట్టంలో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించలేదని, భూభారతి చట్టంలో పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ధరణి చట్టంలో మాదిరి కాకుండా నూతన చట్టంలో క్షేత్రస్థాయిలో సర్వే చేసి విచారణ జరిపిన తరువాతే రిజిస్ర్టేషన్లు, మ్యుటేషన్లు చేయనున్నట్లు తెలిపారు. ధరణిలో ఉన్న 33 మాడ్యూల్స్ కారణంగా రైతులు తమ భూ సమస్య దేని పరిధిలోకి వస్తుందో తెలియక కోర్టులు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడేవారన్నారు. నూతన చట్టంలో మాత్రం రెండంచెల అప్పీలు వ్యవస్థ తీసుకొచ్చారని అన్నారు. భూమి సవరణ కోసం దరఖాస్తు చేసుకుంటే 60 రోజుల్లోగా సమస్య పరిష్కారం అయ్యేలా చట్టం రూపొందించినట్లు వివరించారు. రైతులు తమ భూ సమస్యలకు తహశీల్దార్ వద్ద న్యాయం జరగలేదనుకుంటే ఆర్డీవో వద్దకు అక్కడ సంతృప్తి చెందకుంటే కలెక్టర్ భూమి ట్రిబ్యునల్ వద్దకు వెళ్లి అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. నూతన చట్టంలో అబాదీ, వ్యవసాయేతర భూములు, నివాస స్థలాలకు హక్కులు కల్పించనున్నట్లు వివరిం చారు. ప్రతి గ్రామంలో ఏటా భూమార్పుల రిజిస్టర్, చెరువులు, కుంటలు తదితర నీటి వనరుల రిజిస్టర్, ప్రభుత్వ భూముల రిజిస్టర్, పహణీ వంటి రికార్డులను నిర్వహిస్తారని తెలిపారు. గతంలో భూమి దరఖాస్తులను పరిష్కరించే అధికారం కలెక్టర్‌కు మాత్రమే ఉండేదని, భూభారతి ప్రవేశపెట్టే ముందు తహశీల్దార్, ఆర్డీవోలకు డెలిగేసిన్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం ద్వారా గతంలో కలెక్టర్ లాగిన్‌లో 11వేల దరఖాస్తులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వేలకు తగ్గిందన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఫ భూభారతి చట్టం రైతుల చట్టం
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం రైతులకు చుట్టంలా వ్యవహరిస్తుందని సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ధరణి కారణంగా చెప్పుల అరిగేలా తిరిగినా రైతు ల భూ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ధరణితో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వందల ఎకరాలు తమ పేరిట చేసుకున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌లో నాకు కూడా 20 గుంటలు తక్కువగా ఉన్నట్లు నమోదు కావడంతో ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఈ చట్టంతో తహశీల్దార్, ఆర్డీవో వద్దనే సుమారు 80శాతం భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ చట్టంపై అవగాహన పెంచకొని రైతులు తోటి వారికి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుర్శేడ్ వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు తోట తిరుపతి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి పురమల్ల శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షుడు రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిని తిరుపతి, ఏడీఏ రణదీర్, తహశీల్దార్‌లు సిహెచ్ రాజు రాజేష్, ఎంపీడీవో సంజీవరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి బి సత్యం, ఏఈఓలు, ఆర్‌ఐలు కనకరాజు, వాస్తవిక్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.