రేషన్ కార్డుల్లో గందరగోళం
ABN , Publish Date - Apr 19 , 2025 | 01:00 AM
చొప్పదండికి చెందిన దండే మహేశ్ రేషన్‌కార్డులో భార్య, కుమారుడి పేర్లను చేర్చాలని ప్రజాపాలన సభలో దరఖాస్తు చేసుకున్నాడు. అత్తగారి ఇంటి రేషన్ కార్డు నుంచి భార్య పేరును తొలగించుకున్నాడు.
- చొప్పదండి యువకుడికి సిద్దిపేట జిల్లాలో కార్డు
- తప్పులను సరి చేయాలంటున్న లబ్ధిదారులు
చొప్పదండికి చెందిన దండే మహేశ్ రేషన్‌కార్డులో భార్య, కుమారుడి పేర్లను చేర్చాలని ప్రజాపాలన సభలో దరఖాస్తు చేసుకున్నాడు. అత్తగారి ఇంటి రేషన్ కార్డు నుంచి భార్య పేరును తొలగించుకున్నాడు. భార్య, కుమారుడి పేరుతో కొత్త రేషన్‌కార్డు వస్తుందనుకొని ఎదురు చూశాడు. ఆయనకు నిరాశే ఎదురైంది. కొత్త రేషన్ కార్డు గందర గోళంగా వచ్చింది. భార్యతోపాటు కుమారుడి పేరు గంగాధర మండలం గర్షకుర్తిలోని ఆయన భార్య పుట్టింటి కార్డులో చేరాయి. భార్యపేరును అక్కడికార్డులో తొలగించినప్పటికీ మారిన ఇంటి పేరుతో తిరిగి అదేకార్డులో నమోదు చేశారు. కుమారుడి పేరు కూడా గర్షకుర్తి లోని తన అత్తమామల కార్డులోకి చేరిపోయాయి. ఇలా చాలా మంది పేర్లు భార్య పుట్టింటి కార్డులోకి చేరాయి.
చొప్పదండి పట్టణానికి చెందిన రాజశేఖర్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా సిద్దిపేట జిల్లాలోని కోహెడలోని అత్తగారి కార్డులోకి మార్చారు.
చిట్యాలపల్లిలో తల్లిదండ్రుల పేర్లు లేకుండా మూడేళ్ల పాపకు రేషన్ కార్డు మంజూరు కాగా తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరుగగా ముగ్గురిని కలుపుతూ కొత్త కార్డును పునరుద్ధరించారు.
చొప్పదండి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. కొత్త, పాత కార్డులలో మార్పులు, చేర్పుల కోసం ప్రజాపాలనలో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. కొత్తగా వచ్చిన రేషన్ కార్డులో వివరాలు ఒక చోటుకి బదులు మరోచోట పేర్కొనడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
చొప్పదండి మున్సిపల్ పరిధిలో 1200, మండలంలోని గ్రామాల నుంచి రెండు వేల మంది కొత్త, పాత కార్డులలో మార్పులు, చేర్పుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. అనేక సంవత్సరాల తరువాత రేషన్‌కార్డులు వస్తున్నాయని భావించిన వందలాది మందికి భంగపాటు తప్పలేదు. ఇటీవల కొత్త రేషన్‌కార్డులను జారీ చేస్తుండగా అనేకమంది కార్డులు గందరగోళంగా వచ్చాయి. కథ మళ్లీ మొదటికి రాగా ప్రజలు తిరిగి కార్డులను సవరించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పెళ్లైన మహిళలు తమ పేర్లను అత్తారింటికి మార్చాలని దరఖాస్తులు చేసుకోగా సీన్ రివర్స్ అయ్యింది. భార్య అత్తారింటికి బదులుగా భర్తలను అత్తగారి కార్డుల్లోకి చేర్చారు. కొందరి రేషన్ కార్డులో జిల్లాలు కూడా మారిపోయాయి.
ఫ ఆధార్ అనుసంధానంతో గందరగోళం
ప్రజాపాలనలో రేషన్ కార్డుల దరఖాస్తులు చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో ప్రత్యేకఏర్పాట్లు చేశారు. దరఖాస్తులను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణంలో మున్సిపల్ సిబ్బంది ఆధార్ నంబర్‌తో లాగిన్‌లో అప్లోడ్ చేశారు. రేషన్‌కార్డులకు ఆధార్ అనుసంధానంతో అక్కడి కార్డులు ఇక్కడ, ఇక్కడి కార్డులు అక్కడ వచ్చినట్లు తెలుస్తోంది. భార్య ఆధార్ నంబర్‌ను లాగిన్‌లో అప్‌లోడ్ చేయగానే పాతకార్డుకు అనుసంధానమైనట్లు చెబుతున్నారు. గతంలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులను అప్‌లోడ్ చేయగా ఎలాంటి తప్పులు జరుగలేదు. కాగా రేషన్‌కార్డులు అత్తగారి ఇంటికి మారడంతో కొందరు రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హత కోల్పోయారు. రేషన్ కార్డులో తప్పుల కారణంగా యువవికాసం పథకానికి దరఖాస్తు చేసు కోలేకపోయారు. తమ కార్డులో తప్పుల సవరణల కోసం లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే తమ కార్డులను సవరించాలని కోరుతున్నారు.