ఎండలకు అల్లాడుతున్న మూగజీవాలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:04 AM
సూర్యుడి ప్రతాపంతో నీడ పట్టున ఉన్న మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- పెరిగిన ఉష్ణోగ్రతలతో డీర్‌పార్క్‌లో విదేశీ పక్షుల విలవిల
- ‘కేజ్’లను నీటితో చల్లబరుస్తున్న సిబ్బంది
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): సూర్యుడి ప్రతాపంతో నీడ పట్టున ఉన్న మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జంతువులు, పక్షుల సంగతి ఎలా ఉంటుంది తలుచుకోండి... అడవిలో ఉండే జంతువులు ఏ వాగులోనే... చెరువులోనే ఈత కొడుతూ ఎండతీవ్రతకు గురి కాకుండా ఏ చెట్ల పొదల్లోనో, వృక్షాల కిందనో నీడపట్టున ఉండి తమకు తాము రక్షించుకుంటాయి. కరీంనగర్‌లోని డీర్ పార్క్‌లో కేజ్‌లలో ఉన్న జంతువులు, పక్షులు ఇబ్బంది పడుతున్నాయి. డీర్‌పార్క్‌లో చెట్లు అంతంత మాత్రంగానే ఉండడం, రేకులతో ఏర్పాటు చేసి షెడ్లలో ఎండ, వేడిగాలులతో జంతువులు, పక్షులు సతమతమవుతున్నాయి.
ఫ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
కొద్ది రోజులుగా కరీంనగర్‌లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. పగటి పూట వీస్తున్న వేడి గాలులు, తీవ్రమైన ఎండలకు డీర్‌పార్క్‌లోని జింకలు, వివిధ రకాల పక్షులు విలవిలలాడుతున్నాయి. దీంతో డీర్‌పార్క్ ఇన్‌చార్జి, ఫారెస్ట్ డిప్యూటీ రేంజి ఆఫీసర్ ఆనంద్‌కుమార్ పర్యవేక్షణలో బీట్ ఆఫీసర్లు నరేష్, స్వాతి, సిబ్బంది రంగంలోకి దిగి ఎండ తీవ్రత నుంచి జంతువులు, పక్షులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. పక్షులతోపాటుగా జింకలు వేడిని తట్టుకోలేక ఆహారాన్ని తక్కువగా తీసుకోవడాన్ని గ్రహించిన డీర్‌పార్క్ సిబ్బంది ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి ఎండల నుంచి పక్షులను, జంతువులను రక్షించడానికి చర్యలు చేపట్టారు. జింకలు, సాంబారు, నీల్‌గాయి, కృష్ణజింకలు, మనుబోతు, కుందేలు వంటి జంతువులతోపాటు నెమలి, రామచిలుక, పావురాలు, లవ్ బర్డ్స్, బాతులు, కంజులు, అడవి కోడి, చీమ కోడి, అమెరికా హెన్, టర్కీకోడి, ఈముబర్డ్, వంటి పక్షులకు షెడ్లు నిర్మించారు. వాటిపైన చల్లదనం కోసం తడకలను, ప్రత్యేక గడ్డిని అమర్చారు. షెడ్ల ముందు భాగంలో గోనె సంచులను ఏర్పాటు చేశారు.
ఫ ఆహారం తగ్గించిన పక్షులు, జంతువులు
డీర్‌పార్క్‌లోని విదేశీ పక్షులు, జంతువులు పెరిగిన ఉష్ణోగ్రతలకు అల్లాడిపోతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, టర్కీలో చల్లటి ప్రదేశాల్లో ఉండే హామ్‌స్టార్, ఈము పక్షి, టర్కీ కోడి, అమెరికా హెన్ వంటివి ప్రస్తుతం ఇక్కడి వేడికి తట్టుకోలేక ఆహారం తీసుకోవడం తగ్గించాయి. దీంతో డీర్‌పార్క్ అధికారులు, డాక్టర్లు ప్రత్యేక చర్యలతో వాటికి చల్లటి వాతావరణం కల్పించే చర్యలు తీసుకుంటూ వాటిని సంరక్షిస్తున్నారు.
ఫ కరీంనగర్ డీర్‌పార్క్‌లో మొత్తం 280 వరకు పక్షులు, జంతువులు ఉన్నాయి. ఇందులో 80 వరకు జింకలున్నాయి. 30 పావురాలు, 30 హంసలు, 30 హామ్‌స్టర్లు, 30 కుందేళ్లు, మూడు తాబేళ్లు, ఇతర పక్షులు, జంతువులు ఉన్నాయి. కరీంనగర్ శివారులో మానేరు జలాశయం దిగువన బైపాస్ రోడ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న డీర్‌పార్క్‌కు మరిన్ని జంతువులు, పక్షులు తరలించాలని, పార్క్‌లో పిల్లల ఆట వస్తువులు, సౌకర్యాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.
ఫ స్పింక్లర్లతో చల్లదనం
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడుసార్లు షెడ్‌లపై తడకలను స్పింక్లర్ల ద్వారా నీటితో తడిపి చల్లబరుస్తున్నారు. దీంతో ఎండ వేడి నుంచి పక్షులు, జంతువులకు కొంత మేర ఉపశమనం లభిస్తున్నది. హైదరాబాద్ వంటి పెద్ద పార్క్‌ల్లో జంతువులు, పక్షుల కోసం అధికారులు కూలర్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్ డీర్‌పార్క్‌కు ఆ స్థాయిలో నిర్వహణ సామర్థ్యం లేక పోవడంతో అందుబాటులో ఉన్న మేరకు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కరీంనగర్ డీర్ పార్క్‌ను నెలకు 11 వేల మంది సందర్శిస్తున్నారు. వేసవి కాలం, సెలవుల్లో ఈ సంఖ్య కొద్దిగా పెరుగుతుంది. సందర్శకుల వద్ద వసూలు చేసి చార్జిలతో డీర్‌పార్క్‌కు నెలకు 3 నుంచి 5 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. డీర్‌పార్క్‌లో ముగ్గురు అధికారులు, 17 మంది సిబ్బంది పని చేస్తున్నారు.
ఫ పక్షులు, జంతువుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం...
- ఆనంద్‌కుమార్, డీర్‌పార్క్ ఇన్‌చార్జి, ఫారెస్టు డిప్యూటీ రేంజి ఆఫీసర్
డీర్‌పార్క్‌లో ఉన్న జంతువులు, పక్షుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుని రోజుకు మూడుసార్లు షెడ్లపై నీటిని చల్లుతున్నాం. విదేశీ పక్షులు, జంతువులు పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్నాయి. వైద్యుల సలహాలు, సూచనలతో రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వేసవి కాలంలో విద్యాసంస్థలకు సెలవులు కావడంతో సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.