ఆటలతో ఆనందం..
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:37 AM
పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు సెలవుల మూడ్‌లోకి వెళ్లారు. గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాలల్లో 2024-2025 సంవత్సరానికి సంబంధించిన ప్రొగెస్ కార్డులు అందజేశారు. విద్యా సంవత్సరం ముగిసిపోవడంతో చిన్నారులు వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపేందుకు ప్లాన్‌లు చేసుకున్నారు. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు వచ్చాయి. మరోవారం రోజుల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా రానున్నాయి. పిల్లల విద్యా ప్రణాళికలతో తల్లిదండ్రులు నిమగ్నమైతే, పిల్లలు మాత్రం ఆటల సందడిలో మునిగిపోనున్నారు.
- నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
- జోరుగా పిల్లల ఆట సామగ్రి కొనుగోలు
- పాఠశాలల్లో ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ
- జిల్లాలో 74,626 మంది విద్యార్థులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల )
పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు సెలవుల మూడ్‌లోకి వెళ్లారు. గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాలల్లో 2024-2025 సంవత్సరానికి సంబంధించిన ప్రొగెస్ కార్డులు అందజేశారు. విద్యా సంవత్సరం ముగిసిపోవడంతో చిన్నారులు వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపేందుకు ప్లాన్‌లు చేసుకున్నారు. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు వచ్చాయి. మరోవారం రోజుల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా రానున్నాయి. పిల్లల విద్యా ప్రణాళికలతో తల్లిదండ్రులు నిమగ్నమైతే, పిల్లలు మాత్రం ఆటల సందడిలో మునిగిపోనున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉచిత సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంవత్సరం పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఎదురుచూస్తున్న సెలవుల గురువారం నుంచి మొదలు కానున్నాయి. జూన్ 12వరకు పిల్లలకు ఆటవిడుపుగా మారనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 655 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, జడ్పీహెచ్‌ఎస్, కేజీబీవీ, టీఎస్‌ఎంఎస్, డీఎన్‌టీ, ఎంపీపీఎస్, ఎంపీయూపీఎస్, ఎంపీ హెచ్‌ఎస్, ఆర్బీఎస్, తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 74,626 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ 240, ఎల్‌కేజీలో 435 మంది, యూకేజీలో 670 మంది, 1వ తరగతిలో 7,066 మంది, 2వ తరగతిలో 6,844 మంది, మూడో తరగతిలో 6,490 మంది, 4వ తరగతిలో 7,569, 5వ తరగతిలో 7,333 మంది, 6వ తరగతిలో 7,913 మంది, 7వ తరగతిలో 7,718 మంది, 8 వతరగతిలో 7,842 మంది, 9వ తరగతిలో 7,548 మంది, 10వ తరగతిలో 6,908 మంది ఉన్నారు. మండలాల్లో చూస్తే బోయినపల్లిలో 2,708 మంది, చందుర్తి 3,048 మంది, ఇల్లంతకుంటలో 4,686 మంది, గంభీరావుపేట 5,701 మంది, కోనరావుపేట 4,533 మంది, ముస్తాబాద్‌లో 5,479 మంది, రుద్రంగిలో 2,622 మంది, సిరిసిల్లలో 16,457 మంది, తంగళ్లపల్లిలో 6,333 మంది, వీర్నపల్లిలో 1,455 మంది, వేములవాడ 12,750 మంది, వేములవాడరూరల్ 1,690 మంది, ఎల్లారెడ్డిపేట 7,169 మంది విద్యార్థులు ఉన్నారు. ఈనెల 24న ప్రారంభమయ్యే వేసవి సెలవుల తరువాత జూన్ 12న బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. దాదాపు నెల రోజుల పాటు వీరి అల్లరి తట్టుకోవడానికి తల్లిదండ్రులు ఆటవిడుపును అందిస్తున్నారు. తల్లిదండ్రులు రకరకాలైన ఆటవస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు కూడా సీజన్ బట్టి కొత్తకొత్త రకాల ఆట వస్తువులను తీసుకొచ్చారు. ఈసారి పిల్లలు ఎలకా్ట్రనిక్‌కు సంబంధించిన గేమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఆటలతో పాటు మేథస్సుకు పదును పెట్టే బిజినెస్ గేమ్స్, వీడియో గేమ్స్‌లపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు స్విమ్మింగ్, స్కేటింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి శిబిరాలు కూడా వెలిశాయి. హ్యాండ్‌బాల్, చెస్ క్రీడలను కూడా విద్యార్థులు ఇష్టపడుతున్నారు. క్రికెట్, షటిల్స్ బ్యాట్ల అమ్మకాలు కూడా జోరుగానే ఉన్నాయి. పిల్లలందరూ ఒకచోట చేరి క్యారంలాంటి ఆటలే కాకుండా పాత కాలపు పచ్చీస్, కైలాసం, ఆటలు ఆడుతున్నారు. వీటికనుగుణంగానే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆట సామగ్రి 30 శాతం పెరిగింది. క్యారంబోర్డులు రూ 250 నుంచి రూ 1800, షటిల్‌బ్యాట్లు రూ 100 నుంచి రూ 550, బిజినెస్ గేమ్‌లు రూ 100 నుంచి రూ 200, చెస్‌బోర్డు, కాయిన్‌లు రూ 50 నుంచి రూ 1500 వరకు, టెన్నికాయిట్ రూ 30 నుంచి రూ 80, టీవీ విడియోగేమ్స్ రూ 400 నుంచి రూ 600వరకు, ఇంగ్లీష్ లర్నింగ్ గేమ్స్ రూ 600, ప్లేస్టేషన్‌లు రూ.12 వేలు, తంబోలా రూ 100, ఎలక్ట్రికల్ ఇతర గేమ్‌లు కూడా రూ 1200 వరకు లభిస్తున్నాయి.
ఫ అనుబంఽధాలను పెంచనున్న సెలవులు
యాంత్రిక జీవితంలో పట్టణాలకే పరిమితమైన పెద్దలతో పాటు పిల్లలు గ్రామాల్లో ఉండే అమ్మమ్మలు, నాన్నమ్మలతో గడిపే సమయమే దొరకదు. శుభాకార్యాల సమయంలోనూ, పండుగల సందర్భంగా కలవడమే ఉంటుంది. ఒకటిరెండు రోజులకు మించి పిల్లలు ఊళ్లలో గడిపే అవకాశం ఉండదు. వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఎంచక్కా గ్రామాల్లో ఉండే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల ఇళ్లకు వెళ్లవచ్చని భావిస్తారు. అక్కడ ఉండే రకరకాల బంధువులు, వారి పిల్లలతో కలిసి గడుపుతారు. వివిధ రకాల వ్యక్తులు, పిల్లలు, మాటతీరు, వ్యవహారశైలి, భావోద్వేగాలు, సాంఘిక శైలి కూడా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రాదాయ ఆటలపై కూడా అసక్తి పెరుగుతుంది.
ఫ విహార యాత్రలకు ఏర్పాట్లు..
వేసవిలో మరికొందరు విహార యాత్రలు వెళ్లడానికి టూర్ ప్లాన్‌లు చేసుకుంటారు. పిల్లలకు సెలవులు కావడంతో కొందరు తీర్థయాత్రలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటే మరికొందరు ఊటీ, కులుమనాలి, గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం ద్వారా సృజనాత్మకతకు పెరుగుతుందని భావిస్తారు.
ఫ వేసవిలోనూ జాగ్రత్తలు..
వేసవిలో పిల్లలపై జాగ్రత్తలు వహించాలి. భగ్గుమంటున్న ఎండలు పిల్లలను అస్వస్థతకు గురిచేస్తాయి. ప్రధానంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో ఎక్కువగా చెరువులు, వాగులు, బావుల వద్దకు ఈతకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. ఈతలో అనుభవం లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతారు. పిల్లలు సెల్‌ఫోన్, సినిమాలు చూడడం, గేమ్స్ అడడంపై కాకుండా నాలెడ్జ్ పెంచుకునే విధంగా జనరల్ నాలెడ్జ్, స్టోరీ బుక్స్ చదివే విధంగా ఆసక్తి పెంచాలి. పాజిటివ్ థింకింగ్, మెడిటేషన్, యోగాపై ఆసక్తి పెంచాలని సూచిస్తున్నారు.