యాంత్రీకరణపై ఆశలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:28 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ రైతుల్లో ఆశలు కల్పించింది. గతంలో అమల్లో ఉన్న వ్యవసాయ యాంత్రీకరణ పఽథకం 2016-17 అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ ఈ పథకాన్ని 2024-25అర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు అడుగులు వేసింది. కేంద్రం నిధులు వెనక్కి వెళ్లకుండా వేగవంతంగా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు, యంత్రాలు అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు 198యూనిట్లకు రూ.58.84 లక్షలు మంజూరు చేశారు.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ రైతుల్లో ఆశలు కల్పించింది. గతంలో అమల్లో ఉన్న వ్యవసాయ యాంత్రీకరణ పఽథకం 2016-17 అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ ఈ పథకాన్ని 2024-25అర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు అడుగులు వేసింది. కేంద్రం నిధులు వెనక్కి వెళ్లకుండా వేగవంతంగా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు, యంత్రాలు అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు 198యూనిట్లకు రూ.58.84 లక్షలు మంజూరు చేశారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో యాంత్రీకరణపై దరఖాస్తుల ఆహ్వానం, ఇతర ప్రక్రియ మొదలైనా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదలు పెట్టలేదని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే వ్యవసాయ యాంత్రీకరణలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. 31 దాటిన తరువాత కేంద్రం నిధులు వెనక్కి వెళతాయి. దీంతో ఈనెల చివరి వరకు దరఖాస్తులు స్వీకరించి పనిముట్లు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు కూడా అందాయి.
మహిళా రైతులకే పనిముట్లు..
వ్యవసాయ యాంత్రీకరణలో తొలిసారిగా మహిళా రైతులకు పనిముట్లు అందించడానికి నిర్ణయించారు. 13 రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించారు. 50 శాతం రాయితీతో మహిళా రైతులకు మాత్రమే యంత్రాలు, పరికరాలు ఇవ్వాలని నిర్ణయించారు. సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లోని మండలాల్లో ప్రణాళికలు కూడా రూపొందించారు. యాంత్రీకరణలో ట్రాక్టర్ రూ.5 లక్షలు, రోటోవేటర్ రూ.1.44 లక్షలు, పవర్ టిల్లర్ రూ.లక్ష, స్ర్టాబేలర్స్ రూ.లక్ష, మేయిజ్ షెల్లర్ రూ.లక్ష, కల్టీవేటర్, ప్లవ్, కేజీవీల్, రోటే ఫడ్లర్ రూ.75906, పవర్ స్పేయర్ రూ.45 వేలు, బ్రష్ కట్టర్ రూ.35 వేలు, పవర్ వీటర్ రూ.35 వేలు, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ రూ.30వేలు, బండ్ ఫార్మార్ రూ.13 వేలు, బ్యాటరీ ఆపరేటర్ స్పేయర్ రూ.5 వేలు, తదితర రకాలను 50 శాతంతో అందించనున్నారు.
రైతుల్లో హర్షం...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్‌లలో 4.14 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. వానాకాలం సీజన్‌లో 2,40,503 ఎకరాలు, యాసంగిలో 1,74,101 ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. వ్యవసాయ కూలీల కొరతతో ప్రతి సీజన్‌లోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీపై యంత్రాలు ఇవ్వడం ద్వారా ఇబ్బందులు తొలగుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ప్రభుత్వం 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలలోని రైతులకు 198 యూనిట్లు, రూ.58.84 లక్షలను మంజూరుచేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో వ్యవసాయ పరికరాల కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. కల్టీవేటర్ బయట తయారుచేస్తే రూ.30 నుంచి రూ.50 వేలు, రోటవేటర్ కోనాలంటే రూ లక్ష వరకు ఖర్చు అవుతుంది. పురగుల మందు పిచికారి యంత్రాల ధర మార్కెట్‌లో రూ.3 వేల నుంచి రూ.పది వేల వరకు ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా సగం ధరకే పరికరాలు రానుండడంతో చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
లబ్ధిదారుల ఎంపిక కష్టమే..
వ్యవసాయ అధికారులకు వ్యవసాయ పరికరాలు అందించడం ఎలా ఉన్నా లబ్ధిదారులను ఎంపిక చేయడం కత్తిమీద సాములాగే మారుతుంది. మహిళ రైతుల నుంచి పోటీ ఉండడమే కాకుండా రాజకీయజోక్యం కూడా పెరుగుతుంది. అధికార పార్టీ చెందిన వారి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.