దత్తతపై ఆసక్తి..
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:55 AM
వివాహం జరిగి ఐదు సంవత్సరాలైనా ఆ దంపతులకు సంతానం కలగలేదు.
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): వివాహం జరిగి ఐదు సంవత్సరాలైనా ఆ దంపతులకు సంతానం కలగలేదు. ఆసుపత్రులు తిరిగి వేసారిపోయారు. ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న ఆ దంపతులు సంతానంలేని లోటు వెంటాడుతుండటంతో మానసికంగా ఇబ్బందిపడ్డారు. బంధువుల వద్దకు వెళ్లిన సమయంలో, శుభకార్యాలకు వెళ్ళిన సందర్భంలో సంతానంలేని విషయాన్ని బంధువులు అడిగేవారికి ఏమి సమధానం చెప్పాలో తోచక కొంత ఇబ్బందిపడుతుండేవారు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి కరీంనగర్ శిశుగృహలోని పిల్లలను దత్తతకు తీసుకోవాలనుకున్నారు. కరీంనగర్ డీసీపీ (డిస్ట్రిక్ట్ చైల్డ్‌ప్రొటెక్షన్) అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక బాబును దత్తతకు తీసుకున్నారు. ఆ బాబుతో సంతోషంగా కాలం గడుపుతున్నారు.
ఇలా వివాహానంతరం వివిధ కారణాలతో సంతానం కలుగని దంపతులు.. ఒక సంతానం ఉన్నప్పటికీ మరో సంతానం కావాలనుకునేవారు, ఆడపిల్ల ఉండి మగపిల్లవాడు లేనివారు, మగపిల్లవాడు ఉండి ఆడపిల్ల లేనివారు పిల్లలను చట్టరీత్యా దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గతంలో సమీప బంధువుల పిల్లలనే దత్తత తీసుకునేవారు. మారిన కాలంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు శిశుగృహ నుంచి అనాథ పిల్ల్లలను దత్తతతీసుకుంటున్నారు.
96 మంది పిల్లల దత్తత
పిల్లలను దత్తత కోరుతూ ఆయా దంపతులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా వారిని సంప్రదించి, ఆ దంపతుల ఆర్థిక స్థోమత, ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించి స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు వారి పర్యవేక్షణలోని ఐదేళ్లలోపు పిల్లలను దత్తతనిస్తున్నారు. పలు సీసీఐలలోని 16 ఏళ్ళలోపు పిల్లలను కూడా పలువురు దత్తత తీసుకుంటున్నారు. జిల్లాలోని శిశుగృహ నుంచి 91 మంది పిల్లలను దేశంలోని దంపతులకు, మరో ఐదుగురికి విదేశాలకు చెందిన దంపతులకు దత్తతకు ఇచ్చారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో జిల్లాలో శిశుగృహ, చెల్డ్‌కేర్ సెంటర్‌లలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు చాలామంది దంపతులు ఆసక్తి చూపు తున్నారు. ఇష్టం లేని గర్భమని, ఆడపిల్ల పుట్టిందనే కారణంగా... పిల్లలను పలువురు తల్లిదండ్రులు వదిలేసి వెళుతున్నారు. ప్రమాదాల్లో, అనారోగ్యంతో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి చిన్నారులను స్త్రీ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ట్‌చైల్డ్‌ప్రొటెక్షన్(డీసీపీ) అధికారులు చేరదీసి 0-5 ఏళ్ళలోపు పిల్లలను శిశుగృహలో, 6-16 ఏళ్ళలోపు పిల్లలను చైల్డ్‌కేర్ సెంటర్లలో ఉంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ(కారా) మార్గదరశకాలకనుగుణంగా దేశం మొత్తం ఒకే విధమైన కేంద్రీకృత విధానం ద్వారా పిల్లలను దత్తత ఇస్తున్నారు. జిల్లాలో 2011 నుంచి 2025 ఇప్పటి వరకు 65 మంది బాలికలు, 31 మంది బాలురను మొత్తం 96 మందిని దత్తత ఇచ్చారు.
ఆడపిల్లల వైపే మొగ్గు
కరీంనగర్ జిల్లాలోని శిశుగృహ, చైల్డ్‌కేర్ సెంటర్‌లలోని పిల్లలను దేశంలోని వివిధ రాష్ట్రాలతో (ఇన్‌కంట్రీ)తో పాటు విదేశాల్లోని (ఇంటర్ కంట్రీ) వారికి కూడా సంబంధిత అధికారులు దత్తత ఇస్తున్నారు. ఆ పిల్లల బాగోగులను చూడటంతోపాటు సంతానం లేని దంపతులకు వారిని చట్టబ ద్ధంగా దత్తతనిస్తున్నారు. దత్తత తీసుకుంటున్న వారిలో ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. చట్టాన్ని అధిగమించి పిల్లలను దత్తత తీసుకోవడం నేరమని, అందుకు శిక్షలు కూడా ఉన్నాయని స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పిల్లలపై నిరంతర పర్యవేక్షణ...
సంతానం లేని దంపతుల దరఖాస్తులను పరిశీలించి డీసీపీ (డిస్ట్రిక్ట్‌చైల్డ్‌ప్రొటెక్షన్) అధికారులు వారికి పిల్లలను దత్తతనిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. స్వదేశంలో, విదేశాలకు చెందిన దంపతులకు పిల్లలను దత్తతనిస్తున్నప్పటికీ ఆ పిల్లల సంరక్షణను స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు., స్వదేశంలో అయితే దత్తత ఇచ్చిన జిల్లా అధికారులు దత్తత తీసుకున్న దంపతుల నివాసానికి చేరువలోని ఐసీడీఎస్ అధికారుల ద్వారా పర్యవేక్షిస్తారు. దత్తతపై విదేశాలకు వెళ్లిన చిన్నారులను ఏఎఫ్‌ఏ (ఆథరైస్డ్ ఫారెన్ అడాప్షన్) అనే ఏజెన్సీ ద్వారా పర్యవేక్షిస్తారు.
అర్హతలు...
- పిల్లలు లేని దంపతులు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, ఒంటరిగా జీవిస్తున్నవారు పిల్లలను దత్తత తీసుకోవచ్చు.
- దరఖాస్తుదారులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా స్థిరత్వం కలిగి ఉండాలి. ఎటువంటి ప్రాణాంతక వ్యాధులు కలిగి ఉండరాదు.
- నేర చట్టాల ప్రకారం శిక్ష అనుభవించిన వారు, బాలల హక్కులను దుర్వినియోగపరిచినవారు పిల్లలను దత్తత తీసుకునేందుకు అనర్హులు.
- ఒంటరి మహిళలు అబ్బాయిని కాని, అమ్మాయినికాని దత్తత తీసుకోవచ్చు.
- ఒంటరి పురుషుడు బాలుడిని మాత్రమే దత్తత తీసుకోవాలి.
- దత్తతకు దరఖాస్తు సమర్పించేనాటికి దంపతుల పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు పూర్తి అయిఉండాలి.
- ఇద్దరు పిల్లలు ఉన్న దంపతులు కేవలం అంగవైకల్యం ఉన్న పిల్లల దత్తత కోసమే దరఖాస్తు చేసుకోవాలి.
- తోబుట్టువులను ఒకే కుటుంబానికి దత్తత ఇస్తారు.
- నివాసం ఉంటున్న జిల్లాలోనే పిల్లల దత్తత కోసం దరఖాస్తును సమర్పించాలి.
- దంపతులు జాయింట్ ఫొటోలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డులు, జనన ధ్రువపత్రాలు (విద్యాసంసలు జారీ చేసినవి), ఆదాయ ధ్రువపత్రం (సాలరీ సర్టిఫికెట్/ఆదాయపన్ను రిటర్న్స్/ రెండు లక్షలపైన ఆదాయ ధ్రువీకరణ పత్రం) సమర్పించాలి.
- వివాహ ధ్రువీకరణపత్రం (సబ్‌రిజిస్ట్రార్ జారీచేసినది), ఆరోగ్య ధ్రువపత్రాలు, పోలీసుస్టేషన్ నుంచి క్లియరెన్స్, ఇద్దరు వ్యక్తుల సిఫారసు లెటర్లు (వారి గుర్తింపుకార్డుతోసహ)
- ఆస్తుల వివరాల పత్రాలు (వ్యవసాయ, నివాస, స్థలాల పట్టాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, జీవితబీమా పత్రాలు)
- ఒంటరి వ్యక్తి అయితే విడాకుల డిక్రీ/ భర్త లేదా భార్య మరణ ధ్రువపత్రం, బంధువుల ష్యూరిటీ సమర్పించాలి
- స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ-కరీంనగర్ పేరిట ఆరు వేల రూపాయల డీడీ తీయాలి.
- సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం ధ్రువపత్రాలు జతపరిచిన ఒరిజినల్ ఒక సెట్, జిరాక్స్ ఒక సెట్ ఆఫీస్‌లో అందజేయాలి.
- పాప లేక బాబును దత్తత తీసుకునే రోజున 50 వేల రూపాయల డీడీని సంబంధిత అడాప్షన్ ఏజెన్సీకి అందజేయాలి.