అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:05 AM
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించారు.

కరీంనగర్ క్రైం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నమోదైన అట్రాసిటీ కేసులు, పరిష్కరించిన కేసులు, బాధితులకు అందిన పరిహారం వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేసుల్లో అవసరమయ్యే కుల ధ్రువీకరణ పత్రం వీలైనంత త్వరగా జారీ చేయాలన్నారు. ఈ సందర్భంగా మానిటరింగ్ కమిటీ సభ్యులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చింతకుంటలోని అంబేద్కర్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని, భగత్ నగర్‌లో కేటాయించిన స్థలానికి ప్రహరీ నిర్మించాలని కోరారు. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం కూడలి శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ అంశాలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరగా.. ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల విషయంలో త్వరిత గతిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేష్, డీటీడీవో జనార్దన్, బీఎండబ్ల్యూ పవన్ కుమార్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్, ఏసీపీ వెంకటస్వామి పాల్గొన్నారు.