karimnagar : హస్తవ్యస్తం
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:21 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు తమది అధికార పార్టీ అనే భావనలోనే లేరు.
- కరీంనగర్‌లో గందరగోళంలో కాంగ్రెస్ శ్రేణులు
- నేతల ఆధిపత్య పోరుతో ఇబ్బందులు
- మార్పు కోసం సీనియర్లు ప్రయత్నాలు
- అధిష్ఠానం దృష్టికి జిల్లాలో పార్టీ పరిస్థితి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు తమది అధికార పార్టీ అనే భావనలోనే లేరు. ఈ నియోజక వర్గంలో ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌కు చెందిన వారు కాగా, ఎంపీ బీజేపీ నుంచి గెలిచారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గ ఇన్‌చార్జిలు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేక ఉత్సవ విగ్రహాలుగా మారారనే భావన పార్టీ శ్రేణుల్లో నెలకొన్నది. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించినా జిల్లా మంత్రి ఎవరన్నది మాత్రం బేతాళ ప్రశ్నగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఇద్దరు మంత్రులుగా ఉండగా, ఈ ఇద్దరు కూడా రాజకీయ ఆధిపత్యం కోసం పోటీపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధిష్ఠానం ఏ విషయం తేల్చకపోవడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందని వాపోతున్నారు.
ఫ ఎవరికి వారే..
ఒకరి వద్దకు వెళితే మరొకరికి కోపం, ఒకరిని కలిసినట్లు మరొకరికి తెలిస్తే రాజకీయంగా కార్డు కట్ అవుతుందనే భయంతో మెదలాల్సిన పరిస్థితి ఉంది. నామినేటెడ్ పదవుల భర్తీ లేదు, మంచికి, చెడుకు కార్యకర్తలను పట్టించుకునే వారు లేరు. అధికార పార్టీలో ఉన్నారనే భావనతో ఏ అధికారి వద్దకైనా ఏ పనికోసమైనా వెళ్లే పరిస్థితి లేదు. దీంతో తాము అధికార పార్టీలోనే ఉన్నామా, తమ ప్రభుత్వమే అధికారంలో ఉందా అనే పరిస్థితిలో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు. సుడా చైర్మన్‌గా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఈ నియామకం వెనుక మరో మంత్రి శ్రీధర్‌బాబు హస్తం ఉందనే కారణంతో మంత్రి పొన్నం ప్రభాకర్ దానిని వ్యతిరేకించారు. తన నియామకం తర్వాత మంత్రిని కలవడానికి వెళితే నరేందర్‌రెడ్డితో సానుకూలంగా వ్యవహరించలేదని తెలిసింది. ఇప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటున్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఆయనకు ఇవ్వడం లేదని, చివరికి అధికారిక కార్యక్రమాల్లో కూడా వేదిక పంచుకునే పరిస్థితి లేకుండా పోయిందని కార్యకర్తలు అంటున్నారు. గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ పరిస్థితి అలాగే ఉంది. సత్తు మల్లేశంను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ పదవిలో నియమించారు. ముఖ్యమంత్రి అనుచరుడిగా సత్తు మల్లేశానికి పేరుంది. ఆయన నియామకంపై కూడా మంత్రి పొన్నం సుముఖంగా లేరని, ఇద్దరి మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉందని ప్రచారం జరుగుతున్నది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పురమల్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం అనుచర వర్గం నుంచి దూరమయ్యారు. తనకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. కరీంనగర్ నియోజక వర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వీరంతా వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది.
మంత్రి వర్సెస్ మంత్రి
శ్రీధర్‌బాబు నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలో ఉండగా మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో ఉంది. ఆ నియోజక వర్గానికి సంబంధించిన రెండు మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. సాంకేతికంగా జిల్లా మంత్రిగా వ్యవహరించే అవకాశంతో పొన్నం ప్రభాకర్ జిల్లా మంత్రిగా ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు శ్రీధర్‌బాబు మంత్రిగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గంలో విస్తృత సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఆ సంబంధాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు అవసరాల కోసం ఆయన వద్దకు వెళితే ఆయన వర్గీయులుగా ముద్ర వేస్తున్నారని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కరీంనగర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ నేతల్లో, శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
ఫ పరిస్థితి మార్చాలని..
తమను ఈ పరిస్థితి నుంచి తప్పించేదెవరు అని అందరూ ఆందోళనలో ఉండగా, కొందరు సీనియర్లు కొత్త రాజకీయాలకు తెరతీశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కరీంనగర్ నియోజక వర్గంలో పార్టీ ఉండి లేని మాదిరిగా తయారైంది. పార్టీ అభ్యర్థులు జిల్లా కేంద్ర నియోజక వర్గంలో అసెంబ్లీకి నాలుగు సార్లు, పార్లమెంట్‌కు మూడు సార్లు ఓడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్‌లోనూ ఎటువంటి ప్రభావం చూపించలేమనే భావన ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ఈ పరిస్థితిని చూసి కొందరు సీనియర్లు కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఇక్కడ నెలకొన్న పరిస్థితిని సమగ్రంగా అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లి మార్పు కోసం ప్రయత్నించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్సీ, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెండు రోజుల క్రితం కరీంనగర్‌లో సమావేశమై ఈ విషయమై చర్చించారని, సమావేశంలో పాల్గొన్న వారు రాజకీయంగా పోటీ చేసే ఆసక్తిని ప్రదర్శించక పోగా కేవలం పార్టీ పరిస్థితిని మెరుగు పర్చేందుకే ఈ భేటీ ఏర్పాటు చేశామని సమాచారం. మంత్రుల మధ్య విభేదాలు తొలగించేందుకు చర్యలు తీసుకుని ఎవరో ఒకరికి ఇన్‌ఛార్జి బాధ్యలు అప్పగించి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని మెరుగు పర్చాలని బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గెలుపు దిశగా పయనించేందుకు సన్నద్ధం చేయాలని ఈ భేటీలో వారు అభిప్రాయ పడ్డట్లు సమాచారం. మొదటి నుంచి పార్టీలో పనిచేస్తూ వస్తున్న సీనియర్లను గుర్తించి వారికి వివిధ పదవుల నియామకంలో అవకాశాలు కల్పించాలని, గెలిచే అవకాశాలు ఉన్న వారిని పోటీలో దింపేందుకు పార్టీ చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిసింది. పార్టీ పదవులను సమన్వయంతో వ్యవహరించే వారికి ఇవ్వాలని వారు ప్రతిపాదించాలని సూత్ర ప్రాయంగా అభిప్రాయపడ్డారని సమాచారం. వారం, పది రోజుల్లో సుమారు యాభై మంది నేతలతో మరో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయుంచినట్లు తెలిసింది. విస్తృత స్థాయిలో ఈ విషయాలపై చర్చించి ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసి కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అధిష్టానానికి సమర్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిని, టీపీసీసీ అధ్యక్షుడిని, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జిని కలిసిన తర్వాత ఈ విషయాలపై చర్చించాలని, నివేదికను వారికి సమర్పించాలనుకుంటున్నట్లు తెలిసింది.