Karimnagar: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:11 AM
గణేశ్‌నగర్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): హాస్టల్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్ అన్నారు.

అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్
గణేశ్‌నగర్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): హాస్టల్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్ అన్నారు. కరీంనగర్ రాంనగర్‌లోని ప్రభుత్వ గిరిజన పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహాన్ని అడిషనల్ కలెక్టర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. వంటగదిని, సరుకుల స్టోరేజీ గదిని, విద్యార్థుల వసతి గదులను తనిఖీ చేశారు. వంట గదిలో శుభ్రత పాటించాలని, పరిశుభ్రత, నాణ్యతతో భోజనం తయారు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పోస్ట్ మెట్రిక్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. భోజనం రుచి, నాణ్యతను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఏ సమయానికి ఏయే ఆహారం ఇస్తున్నారని విద్యార్థులను అడిగారు. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ హాస్టల్ ను పక్కా భవనంలోకి మార్చాలని విద్యార్థులు కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీటీడీవో జనార్దన్ పాల్గొన్నారు.