peddaplly : భూ భారతితో సాదాబైనామాలకు మోక్షం
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:04 AM
రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో సాదా బైనామా లతోపాటు ఇతర సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి భూ ప్రక్షాళన చేపట్టి ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
- జిల్లాలో పెండింగులో 35,580 దరఖాస్తులు
- భూ హక్కుల కోసం ఐదేళ్లుగా నిరీక్షణ
- ప్రభుత్వ పథకాలు కోల్పోయిన రైతులు
- జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో భూ భారతి అమలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో సాదా బైనామా లతోపాటు ఇతర సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి భూ ప్రక్షాళన చేపట్టి ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సాదా భైనామాల్లో ఉన్న భూములకు పట్టాలిచ్చేందుకు గత ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ మేరకు పెద్దపల్లి జిల్లాలో 35,580 దరఖాస్తులు వచ్చాయి. ధరణి పోర్టల్‌లో సాదాబైనామాల పరిష్కారానికి ఆప్షన్ లేకపోవడంతో దాదాపు ఐదేళ్లుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆలాగే ఈ పోర్టల్‌తో అనేక మంది రైతులు రికార్డుల్లో పేర్లు, భూ విస్తీర్ణం, సర్వే నంబర్లు తప్పుగా నమోదయ్యాయి. వాటి సవరణలకు కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు. తాము అధికారంలోకి వస్తే ధరణి తొలగిస్తామని ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం కమిటీ వేసి ధరణి పోర్టర్ ద్వారా రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధ్యయ నం చేసి కొత్తగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలోని పలు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తు న్నారు. మిగతా మండలాల్లో భూ భారతి చట్టం పై అవగాహన కల్పిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ చట్టం జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు ధరణి పోర్టల్‌తో ఇబ్బందులు పడ్డ రైతులు తమ కష్టాలు తీరాయని భావిస్తున్నారు.
ఫ జిల్లాలో పెండింగ్ దరఖాస్తులు ఇలా..
2014 జూన్ 2వ తేదీలోపు సాదా బైనామాల ద్వారా భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకోలేని వారి భూములను ఆర్వోఆర్ చేసి పట్టాదార్ పాసు పుస్తకాలను జారీ చేసేందుకు ప్రభుత్వం 2020 ఆక్టోబర్ 1 నుంచి 31 వ తేదీ వరకు అవకాశం కల్పిం చింది. ఆ తర్వాత నవంబరు 10వ తేదీ వరకు పొడి గించింది. మాన్యువల్‌గా కాకుండా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 35,580 దరఖాస్తులు వచ్చాయి. అంతర్గాం మండలంలో 908, పాలకుర్తిలో 1,642, ధర్మారంలో 2284, ఎలిగేడులో 1215, కమాన్‌పూర్‌లో 532, రామగుండంలో 412, రామగిరిలో 1213 దరఖా స్తులు వచ్చాయి. అలాగే జూలపల్లి మండలంలో 1230, ముత్తారం 2834, కాల్వశ్రీరాంపూర్‌లో 5670, ఓదెలలో 1557, పెద్దపల్లిలో 5939, మంధనిలో 4563, సుల్తానా బాద్ మండలంలో 3556 దరఖాస్తులు వచ్చాయి. 2020 అక్టోబరు 24వ తేదీన ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకురాగా, నవంబరు 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. కానీ సాదాబైనామాలు పరిష్కారం కాలేదు. సాదారణంగా భూమి కొనుగోలు పద్ధతి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా జరుగుతుంది. కొనుగోలు చేసిన వ్యక్తి సదరు డాక్యుమెంట్‌తో రెవెన్యూ కార్యాల యం ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకాలను పొందేవారు. అయితే గతంలో రైతులకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లపై అవగాహన లేని సమయంలో సాదాబైనామాలు, తెల్లకాగితాలపై ఒప్పందం చేసుకుని భూమిని తమ స్వాధీనంలోకి తీసుకునేవారు. మోఖాపై భూమిని స్వాధీనపర్చుకున్నప్పటికి రెవెన్యూ రికార్డుల్లో భూ హక్కులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందకుం డా పోయేవి. ఆర్వోఆర్ చట్టం వచ్చిన తర్వాత సాదా బైనామాలు క్రమబద్దీకరించారు. ధరణి వచ్చిన తర్వాత వాటికి పరిష్కారం లభించలేదు.
కొత్త చట్టంతో భూ సమస్యల పరిష్కారం
కొత్త చట్టంలో సెక్షన్ 6, రూల్ 6 ప్రకారం సాదాబైనామాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 2014 జూన్ 2 కంటే ముందు సాదాబైనామాల ద్వారా భూమి కొనుగోలు చేసి 12 ఏళ్ళు స్వాధీనంలో ఉండడంతో పాటు, గత ప్రభుత్వం నిర్ధేశించిన గడువులో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులపై ఆర్డీవోలు విచారణ జరుపుతారు. పీవోటి, సీలింగ్, ఆయా చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకున్న తర్వాత అర్హత ఉన్న రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్ల చార్జీలు, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ తర్వాత హక్కుల రికార్డుల్లో నమోదు చేసి పాసు పుస్తకం జారీ చేస్తారు.
- ఎల్‌ఆర్‌యూపీ తర్వాత ఇబ్బందులు..
రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఎనిమిదేళ్ళ క్రితం ల్యాండ్ రికార్డు ఆప్డేషన్ ప్రోగ్రామ్ (ఎల్‌ఆర్‌యూపి) తెచ్చింది. ఇందులో భాగంగా అన్ని రికార్డులను డిజిట లైజ్ చేయడంతో పాటు ధరణి చట్టం ద్వారా కొత్త పాసు పుస్తకాలు జారీ చేసింది. ఆ సమయంలో చాలా పొరపాట్లు జరిగాయి. భూ విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు రావడం, ఒకరి సర్వే నంబర్‌లోని భూమి మరొకరి పేరిట నమోదయ్యాయి. కాస్తు ఎత్తివేయడంతో అనుభ వంలో ఉన్న వారు అధికారికంగా హక్కులు కోల్పోయి, పట్టాదారుల పేర్లపై పాసుబుక్కులు రావడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కాస్తుదారుల కాలంలో ఉన్న వారితోపాటు, సాదాబైనాల ద్వారా ఆస్తులు కొనుగోలు చేసిన వారు కూడా తర్వాత ఇరకాటంలో పడ్డారు. పోర్టల్‌లో తప్పుగా పేర్లు నమోదు కావడంతో కొందరు ఈ ఆస్తులను ఇతరులకు విక్రయించడం ద్వారా కొర్టుల వెంట తిరుతుగుతున్నారు. ఒకసారి భూమి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఆ భూములపై ఎవరైనా అభ్యంతరాలు చెప్పినా కూడా రిజిస్ట్రేషన్లు ఆగలేదు. రెవెన్యూ కార్యాలయాల్లో మాన్యు వల్ రికార్డులకు అవకాశం లేకుండా చేశారు. వీటిన్నింటిని సవరించి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు, ఇతరులు భావిస్తున్నారు.