Share News

భూ భారతితో సమస్యలు పరిష్కారం

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:29 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతితో రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

భూ భారతితో సమస్యలు పరిష్కారం
హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కలెక్టర్‌ పమేలా సత్పతి

హుజూరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతితో రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శనివారం హుజూరాబాద్‌లో భూ భారతి చట్టం-2025పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల భూములపై భరోసా కల్పిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలు భూ భారతితో పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని తెలిపారు. ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్‌ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేందన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే భూ భారతి చట్టాల ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం ఉందన్నారు. గతంలో తహసీల్దార్‌ పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు కూడా కలెక్టర్‌ దగ్గరికి వచ్చేవని, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం వల్ల పరిష్కరించడంలో జాప్యం జరిగేదన్నారు. భూ భారతి ద్వారా కింది స్థాయి అధికారులకుబాధ్యతలు అప్పగించారన్నారు. ధరణిలో భూ సమస్యల దరఖాస్తులు చేసుకునేందుకు 33 మాడ్యుల్స్‌ పొందుపరిచారని, దీని ద్వారా ఏ సమస్యకు ఏ మాడ్యుల్‌లో దరఖాస్తు చేయాలో అర్థం కాకుండా ఉండేదన్నారు. భూ భారతిలో నాలుగు మాడ్యుల్స్‌ మాత్రమే ఉన్నాయని, రైతులు సులభంగా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌ దేశాయ్‌, లక్ష్మి కిరణ్‌, ఆర్డీవో రమేష్‌బాబు, తహసీల్దార్‌ కనకయ్య, వివిధ శాఖాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:30 PM