Share News

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాకు ఆరో స్థానం

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:39 AM

ఇంటర్మీడియేట్‌ పరీక్షల ఉత్తీర్ణతలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులు 13,922 మంది పరీక్షలు రాయగా, 10,276 మంది ఉత్తీర్ణులయ్యారు. 73.81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాకు ఆరో స్థానం

కరీంనగర్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇంటర్మీడియేట్‌ పరీక్షల ఉత్తీర్ణతలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులు 13,922 మంది పరీక్షలు రాయగా, 10,276 మంది ఉత్తీర్ణులయ్యారు. 73.81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 16,264 మంది పరీక్షలకు హాజరు కాగా 11,358 మంది ఉత్తీర్ణులయ్యారు. 69.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌ విభాగంలోనూ జిల్లా మంచి ఫలితాలనే సాధించింది. వొకేషనల్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 1,530 మంది పరీక్షలు రాయగా 783 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 1265 మంది పరీక్షలు రాయగా 816 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌ విభాగంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో 25వ స్థానంలో నిలిచింది.

ఫ బాలికలదే పై చేయి

ఇంటర్‌ రెండో సంవత్సరంలో ఉత్తీర్ణులయిన 10,276 మందిలో 5413 మంది బాలికలు, 4863 మంది బాలురు ఉన్నారు. మొదటి సంవత్సరం 11,358 మంది ఉత్తీర్ణులు కాగా, వారిలో 6002 మంది బాలికలు, 5356 మంది బాలురు ఉన్నారు. రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. గత సంవత్సరం రాష్ట్రస్థాయిలో కరీంనగర్‌ జిల్లాకు ఐదవ స్థానం దక్కగా, ఈ సారి ఒక్క స్థానం దిగజారింది. ఉత్తీర్ణత శాతం పెరిగినా ఇతర జిల్లాల్లోనూ ఫలితాలు మెరుగవడంతో జిల్లాకు ఆరోస్థానం దక్కింది.

Updated Date - Apr 23 , 2025 | 01:39 AM