సార్వత్రిక సమ్మెతో ఎన్డీఏ సర్కారుకు గుణపాఠం చెప్పాలి
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:31 AM
జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న తలపెట్టనున్న సార్వత్రిక సమ్మెతో ఎన్డీఏ సర్కారుకు గుణపాఠం చెప్పాలని జేఏసీ నాయకులు ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీంపాషా, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్, జిల్లా కార్యదర్శి ఇ నరేష్, ఏజీటీయూసీ జిల్లా కార్యదర్శి సునీల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు పిలుపునిచ్చారు.
- ఐకమత్యంతో కేంద్రంపై పోరాటం
- విలేకరులతో జేఏసీ నాయకులు స్పష్టీకరణ
జ్యోతినగర్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న తలపెట్టనున్న సార్వత్రిక సమ్మెతో ఎన్డీఏ సర్కారుకు గుణపాఠం చెప్పాలని జేఏసీ నాయకులు ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీంపాషా, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్, జిల్లా కార్యదర్శి ఇ నరేష్, ఏజీటీయూసీ జిల్లా కార్యదర్శి సునీల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎన్టీపీసీలోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెకు అన్ని జాతీయ సంఘాలు పిలుపునిచ్చాయని, సమ్మెను విజయవంతం చేసి కార్మిక సంఘాల తడాఖా చూపాలన్నారు. ఈ సారి సమ్మెను విజయవంతం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టామన్నారు. కేంద్రం దూకడుగా కార్మిక రంగంపై తీసుకుంటున్న నష్టదాయకమైన నిర్ణయాలపై కార్మికుల్లో చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా, యూనియన్ల జెండాలు, విధానాలు వేరైనప్పటికీ కార్మిక శ్రేయస్సు కోసం ఐకమత్యంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం అధికార బలం ఉందని నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకు వచ్చిందన్నారు. లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులు తమ హక్కుల్ని కోల్పోతారని, సమ్మె చేసే హక్కే ఉండదని, 12 గంటల పని విధానం ఉంటుందన్నారు. కార్పొరేట్, ప్రైవేటు శక్తులకు ప్రయోజనం చేకూరేలా లేబర్ కోడ్‌లను రూపొందించారన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నదని, లాభాల్లో ఉన్న పీఎస్‌యూలను సైతం కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం వైఖరిని తిప్పికొట్టేందుకే దేశవ్యాప్త సమ్మెకు దిగామన్నారు. కార్మికులకు నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రైవేటీకరణను నిలిపియేయాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియత్రించాలని తదితర 12 డిమాండ్లతో జాతీయ యూనియన్లు సమ్మెలోకి వెళ్తున్నాయని వారు తెలిపారు. కార్మికులు, అన్నివర్గాల ప్రజలు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బూమల్ల చందర్, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు చిలుక శంకర్, సీఐటీయూ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఏజీటీయూసీ నాయకుడు లక్ష్మణ్, టీయూసీఐ నాయకుడు రమేష్, గుర్తింపు సంఘం నాయకులు వేముల కృష్ణయ్య, గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.