Share News

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:00 AM

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ పమేలా సత్పతి, అధికారులు

కరీంనగర్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ఎల్‌ఆర్‌ఎస్‌పై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పేద వారు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రజాప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను అందిస్తుందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సాయం అందడం లేదన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడతలో ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఏప్రిల్‌ 30లోపు మరోసారి ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి నాణ్యతతో పారదర్శకంగా జరగాలన్నారు. ఇందిరమ్మ కమిటీలు అందించిన జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే మంజూరు చేసే జాబితా నుంచి తొలగించాలన్నారు. బేస్‌మెంట్‌ లెవల్‌లో పూర్తి చేసుకున్న వారికి మొదటి విడత కింద లక్ష రూపాయలు ఇటీవలే విడుదల చేశామన్నారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రజలకు భారం కాకుండా 25 శాతం రాయితీని అందించామన్నారు. రాయితీకి ఏప్రిల్‌ నెలాఖరు వరకు గడవు పొడగించామన్నారు. మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌ 25 శాతం రాయితీ గడువు పొడిగింపు ఉండదన్నారు. ఆమోదం పొందిన దరఖాస్తుల ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్‌ దేశాయ్‌, లక్ష్మికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయి, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 01:00 AM