Share News

భూ భారతిలో రెండంచెల అప్పీల్‌ వ్యవస్థ

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:21 AM

భూ భారతి చట్టంలో రెండంచెల అప్పీలు వ్యవస్థ తీసుకొచ్చారని, దీంతో చాలా వరకు భూ సమస్యలు తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయిలోనే పరిష్కారమవుతాయని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

భూ భారతిలో రెండంచెల అప్పీల్‌ వ్యవస్థ
శంకరపట్నంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

శంకరపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధజ్యోతి): భూ భారతి చట్టంలో రెండంచెల అప్పీలు వ్యవస్థ తీసుకొచ్చారని, దీంతో చాలా వరకు భూ సమస్యలు తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయిలోనే పరిష్కారమవుతాయని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శంకరపట్నంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన చట్టంలో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని, పేదలకు ఉచిత న్యాయ సేవలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆధార్‌ తరహాలో భూములకు భూధార్‌ సంఖ్య కేటాయిస్తారని వివరించారు. గతంలో రికార్డులు చూసి రిజిస్ట్రేషన్లు చేసే వారని, కొత్త చట్టంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలు తెలుసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేస్తారన్నారు. భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం లేకుండా పట్టాదారు పుస్తకాల్లో సమగ్ర వివరాలతో హద్దులను పేర్కొంటూ భూమి పటం (మ్యాప్‌) పొందుపరుస్తామన్నారు. ఈ చట్టంలో నివాస స్థలాలు, గ్రామకంఠం, ఆబాది స్థలాలు, వ్యవసాయేతర భూముల వివరాలను కూడా పొందుపరుస్తున్నట్లు తెలిపారు. అనంతరం కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా మౌనం పాటించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, హుజూరాబాద్‌ ఆర్డీవో రమేష్‌బాబు, తహసీల్దార్‌ భాస్కర్‌, ఎంపీడీవో కృష్ణప్రసాద్‌, ఏవో వెంకటేష్‌ పాల్గొన్నారు.

ఫ మానకొండూర్‌లో..

మానకొండూర్‌: భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మానకొండూర్‌లో భూ భారతి చట్టం 2025పై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 2నుంచి భూ భారతి చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. తప్పొప్పులతో ఇబ్బందులు పడుతున్న రైతులు తహసీల్దార్‌ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, తహసీల్దార్‌ రాజేశ్వరి, ఎంపీడీవో వరలక్ష్మి, ఏఎంసీ చైర్మన్‌ మర్రి ఓదెలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:21 AM