కరీంనగర్- తిరుపతి రైలు పొడిగింపు ఎప్పుడు?
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:40 AM
ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుపతికి వెళ్లేందుకు వారానికి రెండు రోజులు కరీంనగర్ నుంచి నడుపుతున్న కరీంనగర్- తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును వారానికి ఐదు రోజులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నా కూడా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. దశాబ్దకాలంగా ఈ రైలు వారానికి రెండు రోజులు మాత్రమే నడుస్తున్నది. ఈ రైలును జగిత్యాల వరకు పొడిగించాలని, వారానికి ఐదు రోజులు నడపాలని ప్రయాణికులు మొత్తుకుంటున్నా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు.
- జగిత్యాల వరకు పొడిగించి ఐదు రోజులు నడపాలని డిమాండ్
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుపతికి వెళ్లేందుకు వారానికి రెండు రోజులు కరీంనగర్ నుంచి నడుపుతున్న కరీంనగర్- తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును వారానికి ఐదు రోజులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నా కూడా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. దశాబ్దకాలంగా ఈ రైలు వారానికి రెండు రోజులు మాత్రమే నడుస్తున్నది. ఈ రైలును జగిత్యాల వరకు పొడిగించాలని, వారానికి ఐదు రోజులు నడపాలని ప్రయాణికులు మొత్తుకుంటున్నా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు.
పెద్దపల్లి నుంచి ఇందూరు వరకు నిర్మించిన నూతన రైల్వే మార్గం పూర్తయిన తర్వాత మొదట కరీంనగర్ నుంచి సిర్‌పూర్ కాగజ్‌నగర్ వరకు ప్రతి రోజు పుష్‌పుల్ రైలును ఆరంభించారు. రైల్వే లైన్ పను లు పూర్తయిన కొద్ది ఆ రైలును ఇందూరు వరకు పొడిగించారు. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, రామగుండం, మంథని, కరీంనగర్ ప్రజలు తిరుపతికి వెళ్లాలంటే కాజీపేట, వరంగల్‌కు వెళ్లి పోవాల్సి వచ్చేది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గమనిం చిన 2009లో కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్ స్టేషన్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ రైలును నడపాలని అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతో 2011 నుంచి వారానికి ఒక రోజు కరీంనగర్ నుంచి వయా పెద్దపల్లి, వరంగల్ మీదుగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపడం ఆరంభించారు. ఈ రైలుకు డిమాండ్ పెరగడంతో పొన్నం ప్రభాకర్ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చి 2013 నుంచి వారానికి రెండుసార్లు గురు, ఆదివారాల్లో నడపడం ఆరంభించారు. 2014లో కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన బోయినపల్లి వినోద్ కుమార్ తిరుపతి రైలును వారానికి కనీసం ఐదు రోజులైనా నడపాలని అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మేరకు 2016లో రెండు, మూడు నెలల పాటు వారానికి తిరుపతికి ఐదు రోజులు రైలును నడిపిన అధికారులు ఆ తర్వాత నిలిపి వేశారు. ఇప్పటికీ వారానికి రెండు రోజులు మాత్రమే నడుపుతున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేశ్ నేత కరీంనగర్- తిరుపతి రైలును వారానికి ఐదు రోజులు నడపాలని కోరినప్పటికీ ఇప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా కరీంనగర్ రైలును కనీసం జగిత్యాల వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదు. గత ఏడాది జనవరి 2న ఎంపీ బండి సంజయ్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి తిరుపతి రైలు సర్వీస్ సేవలను పొడిగించాలని కోరినా కూడా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. అలాగే 2021-22లో జరిగిన టైమ్ టేబుల్ కమిటీ సమావేశంలో ఈ రైలును బాసర వరకు పొడిగించి అక్కడి నుంచి ఆర్మూర్, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా నడిపించాలని ప్రతిపాదించినప్పటికీ ఎటువంటి కదలిక లేదు. ఈ రైలు జనరల్ స్లీపర్, టు టైర్, త్రీ టైర్ ఏసీ బోగీల్లో ప్రయాణిం చేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలంటే నెల రోజుల ముందు నుంచే చేసుకోవాల్సి వస్తున్నది. వెయిటింగ్ లిస్టులో వంద మంది వరకు ఉంటున్నారు. చివరకు తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిని కూడా 30 వరకు వెయిటింగ్ లిస్టులో పెడుతు న్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో అధిక వెయిట్ లిస్టు ఉంటున్నది. వారంలో రెండు రోజులు నడుస్తున్న రైలు సీట్లన్నీ కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్‌లోనే పూర్తి స్థాయిలో నిండుతున్నాయి. తిరుపతికి మాత్రమే కాకుండా విజయవాడ, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఎంతగానో ఈ రైలు ఉపయోగపడుతున్నది. తిరుపతికి వెళ్లేందుకు గతంలో రైల్వే సేవలు తక్కువగా ఉండడంతో అక్కడికి వెళ్లి మొక్కులు సమర్పించుకునే వాళ్ల సంఖ్య తక్కువగా ఉండేది. రామగుండం లైన్ నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్, కాజీపేట, వరంగల్ మీదుగా కృష్ణా ఎక్స్‌ప్రెస్, పద్మావతి ఎక్స్‌ప్రెస్, కేరళ ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లతో పాటు కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండు రోజులు నడుస్తుండడంతో భక్తుల సంఖ్య పెరుగుతున్నది. ఏడాదికోసారి కుటుంబ సమేతంగా భక్తులు వెళుతుండగా, వ్యక్తిగతంగా నలుగురైదుగురు స్నేహితులు కలిసి నెల, రెండు నెలలు, మూడు మాసాలకోసారి తిరుపతికి వెళ్తున్నారు. ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌ను గుర్తించి ఇప్పటికైనా కేంద్ర రైల్వే శాఖ స్పందించి కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలును జగిత్యాల వరకు పొడిగించి వారానికి ఐదు రోజులు నడపాలని, ఈ రైలుకు శ్రీరాజరాజేశ్వర రైలు గా నామకరణం చేయాలని పలువురు కోరుతున్నారు.
ఫ మే 29 నుంచి పెద్దపల్లి జంక్షన్ నుంచి రిజర్వేషన్లు బంద్
పలు రైళ్లు పెద్దపల్లి జంక్షన్‌కు వెళ్లకుండా బైపాస్ రైల్వే లైన్‌ను నిర్మించారు. ఈ లైన్ వచ్చే నెల 29వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నదని తెలుస్తున్నది. మే 29న కరీంనగర్ నుంచి బయలు దేరనున్న తిరుపతి రైలుకు పెద్దపల్లి జంక్షన్ నుంచి టిక్కెట్ల రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎత్తివేసి జమ్మికుంట నుంచి కల్పించడంతో ఈ ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. తిరుపతికి వెళ్లేందుకు జిల్లా వాసులే గాకుండా జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పెద్దపల్లికి వచ్చి వెళుతుంటారు. మే 29కి ముందే బైపాస్ లైన్ గుండా తిరుపతి రైలు వెళ్లనుండడంతో తామంతా ఎక్కడికి వెళ్లి రైలు ఎక్కా లని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై పెద్దపల్లి, కరీంనగర్ ఎంపీలు చొరవ తీసుకుని పెద్దపల్లి బైపాస్‌లో చీకురాయి వద్ద పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ నిర్మించే వరకు పెద్దపల్లి జంక్షన్ గుండానే కరీంనగర్- తిరుపతి రైలు నడిపించాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు.