పరిహారం అందేదెన్నడో..?
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:42 AM
ప్రతీ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డివిజన్లలో అకాల వర్షం, వడగళ్లు కురవడంతో పలు పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మామిడి, వరి, మొక్కజొన్న, నువ్వు పంటలకు అపార నష్టం వాటిల్లింది. వేసవిలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులు అన్నదాతలను అతలాకుతలం చేశాయి. ఈదురు గాలుల ధాటికి మామిడి కాయలు నేలరాలగా వడ్లు తడిచి ముద్దయ్యాయి. ఎకరానికి రూ.40వేల నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని, కోత సమయానికి గాలి, అకాల వర్షం వచ్చి నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ప్రతీ యేడు ప్రకృతి వైపరిత్యాలతో దెబ్బతింటున్న పంటలు
-అటకెక్కిన పంట బీమా పథకాలు
-నష్టపరిహారం కోసం అన్నదాతల ఎదురుచూపులు
జగిత్యాల, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రతీ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డివిజన్లలో అకాల వర్షం, వడగళ్లు కురవడంతో పలు పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మామిడి, వరి, మొక్కజొన్న, నువ్వు పంటలకు అపార నష్టం వాటిల్లింది. వేసవిలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులు అన్నదాతలను అతలాకుతలం చేశాయి. ఈదురు గాలుల ధాటికి మామిడి కాయలు నేలరాలగా వడ్లు తడిచి ముద్దయ్యాయి. ఎకరానికి రూ.40వేల నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని, కోత సమయానికి గాలి, అకాల వర్షం వచ్చి నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫరెండు నెలల్లో నష్టం ఇలా..
జిల్లాలో గత నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య పలు మార్లు కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులతో పలు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా పది మండలాల్లో 1,036.31 ఎకరాలలో వరి, మొక్కజొన్న, ఇతర పంటలను 1,843 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. బీర్‌పూర్, బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి, జగిత్యాల రూరల్, మేడిపల్లి, పెగడపల్లి, సారంగాపూర్, వెల్గటూరు మండలాల్లో వరి 592.6 ఎకరాలు, మొక్కజొన్న 444.12 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ధర్మపురి మండలంలో 580.5 ఎకరాల్లో వరి, గొల్లపల్లి మండలంలో 153.36 ఎకరాల్లో మొక్కజొన్న, జగిత్యాల రూరల్‌లో 184.33 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టానికి గురైనట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈనెల 18న కురిసిన అకాల వర్షంతో మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, కోరుట్ల రూరల్, భీమారం మండలాల్లో 12,050 మంది రైతులకు చెందిన 11,491 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 7,006 రైతులకు చెందిన వరి 5,565 ఎకరాల్లో, 2,069 రైతులకు చెందిన నువ్వు 1,751 ఎకరాల్లో , 1,714 మంది రైతులకు చెందిన బాజ్ర 1,512 ఎకరాల్లో, 255 మంది రైతులకు చెందిన మొక్కజొన్న 305 ఎకరాల్లో, 1,006 మంది రైతులకు చెందిన మామిడి 2,358 ఎకరాల్లో నష్టపోయినట్లు అధికారులు తేల్చారు.
ఫజిల్లాలో మూడేళ్లలో పంట నష్టం..
జిల్లాలో 2021 వానాకాలం సీజన్‌లో అధిక వర్షాలతో 30 వేల ఎకరాల్లో, యాసంగి సీజన్‌లో వడగళ్లతో 12 వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. 2022 వానాకాలం సీజన్‌లో 12,588 మంది రైతులకు 22,993 ఎకరాల్లో ఆరుతడి, 4,130 మంది ఎకరాల్లో వరి దెబ్బతిన్నాయి. 2023 మార్చి, ఏప్రిల్ మాసాల్లో దెబ్బతిన్న పంటలకు ఎకరాలకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. మార్చిలో 6,199 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 532 ఎకరాలకు మాత్రమే పరిహారం అందించారు. ఏప్రిల్ మాసంలో 52 వేల ఎకరాల్లో మామిడి, వరి, నువ్వు, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు నష్టం జరిగినప్పటికీ పరిహారం అందించలేదు. 2023 వానాకాలం సీజన్‌లో భారీ వర్షాల వల్ల 14,065 మంది రైతులకు చెందిన 15,487 ఎకరాల్లో వివిధ పంటలు, 2024 వానాకాలం సీజన్‌లో జిల్లాలో భారీ వర్షాలతో 9 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
ఫపత్తాలేని బీమా పథకాలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పలు బీమా పథకాలు అమలు చేసేవి. ఇందులో పంట బీమా పథకం (ఫసల్ బీమా యోజన), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలు ఉన్నాయి. ఈ పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుండగా, మరికొంత రైతులు చెల్లించాల్సి ఉండేది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచి రాష్ట్రం వాటా చెల్లించకపోవడంతో ఫసల్ బీమా యోజన పథకం అమలు కావడం లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగళ్లు, ఈదురు గాలుల వంటి వాతావరణ మార్పులతో మామిడి, మిరప, పత్తి పంటలు నష్టపోతే ఆయా పంటలకు పరిహారం అందించేలా ప్రభుత్వం వాతావరణ బీమా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రైతులు చేరినా నష్టం జరిగిన సందర్భాల్లో వివిధ నిబంధనలను సాకుగా చూపి ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం ఇచ్చేందుకు ఆసక్తి కనబరచలేదని రైతులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగితే వాతావరణ కేంద్రం నుంచి సరియైున సమాచారం వెళ్లకపోవడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో ఈ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది.
ఫపరిహారానికి ని‘బంధనాలు’..
జిల్లాలో ఈదురు గాలులు, వడగళ్ల వర్షంతో చేతికొచ్చిన పంటకు నష్టం వాటిల్లింది. నిబంధనల ప్రకారం 33 శాతం నష్టం జరిగితేనే పరిగణనలోకి తీసుకోవాలనే ఉత్తర్వులు జారీ రావడంతో అధికారులు సర్వే నిర్వహించారు. చాలా చోట్ల కోత దశలో ఉన్న పంటలను జాబితాలోకి ఎక్కించలేదు. నష్టం లెక్కలోకి తీసుకోవాలని రైతులు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు. నిర్ణీత శాతం లోపు జరిగిన నష్టాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు.
ఫపరామర్శలకే పరిమితమైన ప్రజాప్రతినిధులు
జిల్లాలో ఈదురు గాలులు, అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు విస్తృతంగా పల్లెల్లో పర్యటించి రైతులకు భరోసా అందించారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇబ్రహీంపట్నం మండలం కోజిన్ కొత్తూర్‌లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. ఇటీవల కలెక్టర్ సత్యప్రసాద్ సైతం మెట్‌పల్లి, కోరుట్ల రెవెన్యూ డివిజన్లలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మెట్‌పల్లి మండలంలో ఏఎంసీ చైర్మన్ కూనగోవర్ధన్‌లు పర్యటించి పరిశీలన జరిపారు. అయితే పరిశీలనలు, పరామర్శలతో పాటు పంటకు నష్ట పరిహారం అందించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.