Rajagopal Reddy: మా సీఎం మంచోడు
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:46 AM
తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచివారని, ఆయన మంచితనం వల్లే, బీఆర్‌ఎస్ వాళ్లు 15 నెలలుగా ప్రశాంతంగా ఉంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

అందుకే మీరు 15 నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు
మరో వెయ్యి జన్మలెత్తినా బీఆర్‌ఎస్‌కు అధికారం కలే: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచివారని, ఆయన మంచితనం వల్లే, బీఆర్‌ఎస్ వాళ్లు 15 నెలలుగా ప్రశాంతంగా ఉంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. లేకుంటే రేపటి నుంచి మరో లెవల్‌లో ఉంటుందన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలు బుగ్గకారు, సైరన్ సౌండ్‌కు బాగా అలవాటు పడ్డారని, అది లేనిదే నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. మరో వెయ్యి జన్మలెత్తినా ఆ పార్టీకి అధికారం కలేనన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 8,742 హత్య కేసులు, 18,246 లైంగిక దాడి కేసులు నమోదు అయ్యాయన్నారు. 2014-23 మధ్య పోలీసులను అడ్డంపెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టులకు భూముల కోసం రైతులను పోలీసులతో బెదిరించి, భూములు లాక్కున్నారని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి ప్రసంగం ముగియగానే ఎమ్మెల్యే హరీశ్ స్పందిస్తూ ‘కంగ్రాచ్యులేషన్స్.. నీకు హోంమంత్రి పక్కా’ అని వ్యాఖ్యానించారు.