కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:43 AM
కేటీఆర్ అంటే ఎవరో ప్రజలకు కూడా తెలియదని, ఆయన తండ్రి చాటు బిడ్డ అని, ఆయన తమలాగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

ప్రభాకర్‌రావు అమెరికా నుంచి రాగానే కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ జైలుకే: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్ అంటే ఎవరో ప్రజలకు కూడా తెలియదని, ఆయన తండ్రి చాటు బిడ్డ అని, ఆయన తమలాగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ అమెరికాలో చదువుకుని ఇక్కడ ఇంగ్లిష్ మాట్లాడుతూ హీరో అనుకుంటున్నాడని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎ్‌సను బొందపెట్టారని, ఆ పార్టీకి 11 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదన్నారు.
కేటీఆర్ సూర్యాపేటలో సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఖండించారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. అప్పటి ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు అమెరికా నుంచి వచ్చిన వెంటనే కేసీఆర్ కుటుంబ సభ్యులంతా జైలుకు పోవడం ఖాయమన్నారు. శ్రీశైలం సొరంగం పనులు తాత్కాలికంగా ఆగినా.. నాలుగైదు నెలల్లో నూతన ప్రణాళికతో ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.