Konda Surekha: జోగులాంబ ఆలయ పూజారిపై విచారణకు మంత్రి సురేఖ ఆదేశం
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:02 AM
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై విచారణకు మంత్రి కొండా సురేఖ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై విచారణకు మంత్రి కొండా సురేఖ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌లో మంత్రిని అర్చకులు, స్వామీజీలు కలిసి అర్చకుడు ఆనంద్‌శర్మ, ఈవో పురేందర్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని కోరారు. అంతకు ముందు హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం ఎదుట వారంతా ఆందోళన చేశారు. శక్తిపీఠాల్లో ఒక పీఠమైన జోగుళాంబ ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు. ఆనంద్ శర్మపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా అతడిపై ఆరోపణలు వస్తున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఆలయంలోని ఆభరణాల మాయం, పూజారి అవినీతిపై ప్రభుత్వ సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు బయట పడతాయని వారు అన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: ఆనంద్ శర్మ
అలంపూర్ ఆలయంలో అవినీతి, అక్రమాలు జరిగితే దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, అక్రమాలు నిజమని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ అన్నారు. ఆలయంతో సంబంధంలేని వ్యక్తులు కొంతమంది ఆలయాన్ని అభాసుపాలు చేస్తున్నారని మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు.