జంక్షన్‌గా కొత్తపల్లి రైల్వే స్టేషన్
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:34 AM
కొత్తపల్లి రైల్వేస్టేషన్ కొత్త హంగులు సంతరించుకుంటున్నది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే పురోగతిలో ఉండడంతో కొత్తపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్‌గా మారనున్నది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు 2027 నాటికి పూర్తి చేయనున్నట్ల్లు కేంద్ర మంత్రి బండి సజంయ్‌కుమార్ రైల్వే అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ప్రకటించారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కొత్తపల్లి రైల్వేస్టేషన్ కొత్త హంగులు సంతరించుకుంటున్నది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే పురోగతిలో ఉండడంతో కొత్తపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్‌గా మారనున్నది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు 2027 నాటికి పూర్తి చేయనున్నట్ల్లు కేంద్ర మంత్రి బండి సజంయ్‌కుమార్ రైల్వే అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ప్రకటించారు. కొత్తపల్లి రైల్వే స్టేషన్ విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు జంక్షన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని పనులను చురుకుగా చేస్తున్నారు. కొత్తపల్లి రైల్వే స్టేషన్ పరిధిని పెంచి జంక్షన్ ఏర్పాటుకు అనువైన ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. స్టేషన్ అభివృద్ధి కోసం అన్ని వసతులతో నిర్మాణానికి 60 కోట్ల రూపాయలతో పనులను పూర్తి చేస్తున్నారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.4 కిలో మీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణానికి 2016 జూలై 21న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1,160.48 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించినా ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అంచనా వ్యయం పెరిగింది. ప్రస్తుత అంచనా ప్రకారం 2,780.78 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి ఇప్పటికే 1,400 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 76.135 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 75 కిలోమీటర్లకు పైగా పనులు చేపట్టాల్సి ఉంది. 2024-25 బడ్జెట్‌లో 350 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అందులో 262.93 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సెప్టెంబరు నాటికి సిద్దిపేట-రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మరో 30 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు 38.6 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పనులు చేపట్టాల్సి ఉంది. సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు ట్రాక్ నిర్మాణ పనులు పూర్తయ్యేలోపే కొత్తపల్లి రైల్వే స్టేషన్‌ను పూర్తిగా జంక్షన్‌గా మార్చేందుకు అవసరమైన పనులను పూర్తి చేస్తున్నారు. కొత్తపల్లి రైల్వే స్టేషన్ నూతన హంగులతో జంక్షన్‌గా కొత్త రూపును సంతరించుకుంటున్నది.
ఫ పలు అభివృద్ధి పనులు
కొత్తపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్‌గా మార్చేందుకు రైల్వేస్టేషన్ పొడవు 1800 మీటర్లు, వెడల్పు 175 మీటర్లతో కొత్తపల్లి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. కొత్తపల్లి రైల్వే స్టేషన్ వద్ద మూడు రైల్వే లైన్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్‌లో రైళ్ల రాక పోకలు కొనసాగుతున్నాయి. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తయితే కొత్తపల్లి రైల్వే స్టేషన్ వద్ద మూడు లైన్లు ఏర్పాటు కానుండడంతో ఈ స్టేషన్‌ను జంక్షన్‌గా మార్చి అభివృద్ధి చేస్తున్నారు. కొత్తపల్లి రైల్వే స్టేషన్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్ది జంక్షన్‌గా మార్చనున్నారు.
ఫ గ్రానైట్ రవాణా ఇక్కడి నుంచే...
ఉమ్మడి జిల్లాలో గ్రానైట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. ప్రస్తుతం గ్రానైట్ రాళ్లను లారీల ద్వారా కరీంనగర్ రైల్వే స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి గూడ్స్ రైళ్ల ద్వారా కాకినాడ పోర్టుకు తీసుకు వెళ్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి సముద్ర మార్గంలో చైనాకు గ్రానైట్ రాళ్లు తరలిస్తారు. గ్రానైట్ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో కరీంనగర్ రైల్వే స్టేషన్ గూడ్స్ రైళ్లతో నిండి పోతున్నది. గ్రానైట్ రవాణా కోసం కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రానైట్ రవాణాను కొత్తపల్లి రైల్వే స్టేషన్ నుంచే చేసేందుకు అనువుగా ఉండడంతో జంక్షన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గ్రానైట్‌తోపాటు కొత్తపల్లి రైల్వే స్టేషన్‌కు అనువైన స్థలం ఉండడంతో ఇక్కడి నుంచే సరుకు రవాణా వేగవంతంగా చేసే వెసులుబాటు ఉండడంతో జంక్షన్ ఏర్పాటు పనులు చకాచకా సాగిపోతున్నాయి. మొత్తానికి కొత్తపల్లి రైల్వే స్టేష న్ నూతన హంగులతో జంక్షన్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది.
ఫ జిల్లాలో రైల్వే అభివృద్ధి...
కరీంనగర్‌లో రైల్వేస్టేషన్‌తోపాటు, కొత్తపల్లి రైల్వే స్టేషన్‌లు ఏక కాలంలో అభివృద్ధి జరుగుతుండడంతో జిల్లా ప్రజలకు రైలు ప్రయాణం వేగం పెంచుకోనున్నది. ఇప్పటికే పెద్దపల్లి-నిజామాబాద్ మధ్య రైల్వే లైన్ పూర్తయి, కొత్తపల్లి మనోహరా బాద్ రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. హసన్‌పర్తి-కరీంనగర్ కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలు ముందుకు సాగుతుండడంతో కరీంనగర్‌లో రైల్వే అభివృద్ధి చెందనున్నది. కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా అధునాతన హంగులతో మార్చి నాటికి అందుబాటులోకి తేవడానికి పనులు జరుగుతున్నాయి. గూడ్స్‌తో పాటు, ప్యాసింజర్ రైలు ఈ లైన్ల మీదుగా ఎక్కువ సంఖ్యలో వెళ్లనుండడంతో అన్ని ప్రాంతాలకు రైలు ప్రయాణం సులువు కానున్నది.