KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:21 AM
‘ప్రధాన ప్రతిపక్షంపై సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చాలదన్నట్లు.. ఇప్పుడు అధికార యంత్రాంగంపై కూడా వేధింపులకు దిగడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గనిపించడం లేదా..?’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

హస్తిన యాత్రలు కాదు.. ముందు ఆ కార్మికులను కాపాడండి: కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘ప్రధాన ప్రతిపక్షంపై సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చాలదన్నట్లు.. ఇప్పుడు అధికార యంత్రాంగంపై కూడా వేధింపులకు దిగడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గనిపించడం లేదా..?’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ (అట్లాస్) రిపోర్టుతో బీఆర్‌ఎస్ దార్శనిక పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడా బట్టబయలు కావడంతో సీఎంకు మింగుడుపడటం లేదని విమర్శించారు. వెబ్‌సైట్ నుంచి రిపోర్టును తొలగించి సంబంధిత అధికారులపై వేధింపులకు దిగడాన్ని ఖండిస్తున్నామని బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను సురక్షితంగా కాపాడే విషయాన్ని విస్మరించి హస్తిన పర్యటనలతో హడావుడి చేస్తున్నారన్నారు.
ఎన్నికలు, ఢిల్లీ టూర్లు అని తిరిగే రేవంత్‌కు పాలన అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ గతంలోనే చెప్పారని.. ఇన్‌స్టా రీల్స్ కాకుండా సీఎం ఆ వీడియో చూస్తే కొంచెమైనా విషయ పరిజ్ఞానం వస్తుందంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతు ప్రకటించారు. దేశానికి అవసరమైనప్పుడు కుటుంబ నియంత్రణను సమర్థంగా పూర్తి చేసిన దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేయడం తగదన్నారు. దేశానికి రాష్ట్రాలు అందించే ఆర్థిక సహకారం ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.