KTR: ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:17 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. అసమర్థతకు, పరిపాలనా వైఫల్యానికి నిలువుటద్దమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

సంక్షేమానికి సమాధి.. అభివృద్ధి అడ్రస్ గల్లంతు.. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్
ఓట్లేసిన పాపానికి ప్రజల్ని నిలువునా ముంచారు
1.60 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారో చెప్పాలి
ఊసరవెల్లి ముదిరితే రేవంత్‌రెడ్డి: కేటీఆర్
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. అసమర్థతకు, పరిపాలనా వైఫల్యానికి నిలువుటద్దమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలకిచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి మూటలు పంపడం పైనే బడ్జెట్‌లో దృష్టి పెట్టారని ఆరోపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బడ్జెట్ పేదల కష్టాలను తీర్చేలా లేదని, ఢిల్లీకి మూటలు పంపేలా ఉందని అన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి 4 కోట్ల మంది ప్రజలను కాంగ్రెస్ నిలువునా ముంచిందన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపులు చూస్తే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు గోవిందా అని అర్థమవుతోందని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ధ్వజమెత్తారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని, అదే ఊసరవెల్లి ముదిరితే రేవంత్‌రెడ్డి అవుతారని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి తెలివితక్కువతనం, నెగెటివ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని ఆరోపించారు. మీడియా ముందు రంకెలు వేయడంకాదని, అంకెలు ఎందుకు ఆగమయ్యాయో సీఎం చెప్పాలని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేనేతకు రూ.1200 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు రూ.300 కోట్లు ప్రకటించి బడ్జెట్‌ను పరిమితం చేశారని విమర్శించారు. వైన్‌షాపుల్లో గౌడన్నలకు 25 శాతం రిజర్వేషన్, యాదవులకు ఆర్థిక చేయూత ప్రస్తావన అసలే లేదని, హైదరాబాద్ మహానగరం పెండింగ్ నగరంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. తులం బంగారం పథకం, రైతుకూలీలకు రూ.12 వేలు ఇవ్వలేదని, పింఛన్లు రూ.4 వేలు ఇస్తామని చేతులెత్తేశారని, దళితులను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
తెచ్చిన అప్పులను ఏం చేశారు?
రుణమాఫీ జరిగిందో, లేదో.. కాంగ్రెస్ వాళ్లకే అర్థం కావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డు ఊసే లేదన్నారు. తమ హయాంలో ఏడాదికి రూ.40 వేల కోట్ల అప్పు చేస్తే గగ్గోలు పెట్టారని, కానీ.. ఇప్పుడు ఏడాదిలోనే రూ.1.60 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. ఈ మొత్తాన్ని దేనికి వినియోగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమానికి సమాధి, అభివృద్ధి అడ్రస్ గల్లంతు అయ్యాయని ఆరోపించారు. వారు చేపట్టేది యువ వికాసం పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలకు రూ.6వేల కోట్లను పంచి పెడతామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమానికి పెనుముప్పులా ఉన్న ఈ బడ్జెట్‌ను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు.
భట్టి బడ్జెట్.. ఝూటా బడ్జెట్: హరీశ్
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : భట్టి బడ్జెట్.. ఝూటా బడ్జెట్ అని.. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్నీ అబద్ధాలు, అతిశయోక్తులే ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారని.. ఈ బడ్జెట్‌లోనూ ప్రజలకు నిరాశే మిగిలిందని అన్నారు. మహాలక్ష్మి పథకంలో ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇచ్చేందుకు డబ్బుల్లేవు కానీ.. అందాల పోటీల కోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు పెట్టారని ధ్వజమెత్తారు. చేయూత కింద కొత్తవారికి పింఛన్ ఇవ్వలేదని.. వస్తున్న వారిలో 1.50 లక్షల మందికి కోతపెట్టారని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చిత్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ ఆలోచనా విధానం వల్లే తెలంగాణ దివాళా తీసింది. గత బడ్జెట్‌లో ఆరు ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు.. ఒక్కటైనా పూర్తి చేశారా..? రుణమాఫీ అయిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. నా నియోజకవర్గంలో రూ.2 లక్షలలోపు ఉన్న 10,150 మందికి రుణమాఫీ కాలేదు ’’ అని హరీశ్‌రావు అన్నారు.