KTR: ఒంటరిగా రావాల్సిందే!
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:23 AM
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ ఝలక్
న్యాయవాదులతో వచ్చిన కేటీఆర్.. లోపలికి అనుమతించని ఏసీబీ
9న రావాలని కేటీఆర్‌కు మరోసారి నోటీస్
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు న్యాయవాదులతో కలిసి వెళ్లిన బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను పోలీ్‌సలు ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించలేదు. పోలీ్‌సలపై నమ్మకం లేకే న్యాయవాదులతో కలిసి వచ్చానని కేటీఆర్ బదులిచ్చారు. దాంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు న్యాయవాదులతో కలిసి విచారణకు అనుమతించేది లేదని ఏసీబీ నుంచి కచ్చితమైన ఆదేశాలు రావడంతో గేటు దగ్గర ఉన్న పోలీసులు కేటీఆర్‌కు అదే విషయాన్ని చెప్పారు. దాంతో ఆయన విచారణకు హాజరు కాకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. తాను చెప్పాలనుకున్నది లిఖిత పూర్వకంగా అందజేసి వెళ్లిపోయారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీ్‌సలు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు రావాలని, న్యాయవాదుల్ని అనుమతించేది లేదని అందులో స్పష్టం చేసింది.