Share News

Telangana: కారులో కూర్చుని.. నిప్పంటించుకొని..

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:21 AM

ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడిన తీరు మాత్రం అత్యంత హృదయవిదారకంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ప్రేమికుల్లో అమ్మాయి మైనర్‌. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానని

Telangana: కారులో కూర్చుని..  నిప్పంటించుకొని..

ప్రేమజంట బలవన్మరణం.. ఘట్‌కేసర్‌లో ఘోరం

ఇద్దరిలో అమ్మాయి మైనర్‌.. ఐదేళ్లుగా ప్రేమలో..

డబ్బులివ్వకపోతే ప్రేమ గురించి ఇంట్లో చెబుతా

అంటూ బాలికకు సమీపబంధువు బెదిరింపులు

అతడికి రూ.1.35 లక్షలు ఇచ్చిన ప్రియుడు

అయినా డబ్బులడగడంతో ఆత్మహత్యకు నిర్ణయం

స్నేహితుడి నుంచి కారు తీసుకున్న యువకుడు

లోపల బాలికతో కలిసి ఒంటిపై పెట్రోలు

కారు దగ్ధం.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు

బంధువులకు వాట్సా్‌పలో సూసైడ్‌ నోట్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌/బీబీనగర్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడిన తీరు మాత్రం అత్యంత హృదయవిదారకంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ప్రేమికుల్లో అమ్మాయి మైనర్‌. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానని బాలికను ఆమె సమీప బంధువు బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఆ జంట భయపడిపోయింది. కారులో కూర్చున్న ఇద్దరూ ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నారు. పెద్ద ఎత్తున చెలగరేగిన మంటల్లో కారు పూర్తిగా దగ్ధమవగా.. ఇద్దరూ సజీవదహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మృతులు యాదాద్రి-భువనగిరి జిల్లా బీబీనగర్‌కు మండలం జమీలపేట్‌కు చెందిన 25 ఏళ్ల పర్వతం శ్రీరామ్‌, 17 ఏళ్ల బాలిక! కారు మంటల్లో చిక్కుకోవడాన్ని పోలీసులు తొలుత ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించారు. శ్రీరామ్‌, సూసైడ్‌ నోట్‌ను తన బంధువులకు వాట్సాప్‌ చేయడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీరామ్‌కు పోచారం మునిసిపాలిటీ, నారపల్లిలో సైకిల్‌ షాపు ఉంది. ఆ దుకాణం పక్కనే ఉండే ఓ మైనర్‌ బాలికతో శ్రీరామ్‌కు పరిచయమైంది. ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ బాలిక ఇంటర్‌ చదువుతోంది. అయితే బాలిక ప్రేమ విషయం ఆమె సమీప బంధువైన మక్తాకు చెందిన చింటుకు 15 రోజుల క్రితం తెలిసింది. అప్పటి నుంచి బాలికను చింటు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వాలని, లేదంటే ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు చెబుతానని బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె, శ్రీరామ్‌కు చెప్పడంతో అతడు చింటుకు రూ.1.35లక్షలు ఇచ్చాడు.


అయితే మరిన్ని డబ్బులు కావాలంటూ కాలేజీకి వెళ్లి మరీ చింటు ఆమెను వేధింపులుకు గురిచేయడం, శ్రీరామ్‌ దగ్గర ఇవ్వడానికి డబ్బులేమీ లేకపోవడంతో.. ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శ్రీరామ్‌ సోమవారం ఉదయం 10 గంటలకు బోడుప్పల్‌కు చెందిన తన స్నేహితుడు నవీన్‌ వద్ద ఎర్టిగా కారు (టీఎస్‌ 08 జేయు 1163)ను అడిగి తీసుకొని బాలికతో కలిసి వెళ్లాడు. సాయంత్రం ఘనాపూర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ సర్వీరు రోడ్డు సమీపంలో కారు ఆపాడు. లోపల ఇద్దరూ ఒంటికి నిప్పంటించుకున్నారు. కారులో పెద్దగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. మంటలకు తాలలేక శ్రీరామ్‌ కారులోంచి బయటకొచ్చి ఫుట్‌పాత్‌పై పడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. కారు డోర్‌ లాక్‌ కావడంతో బాలిక లోపలే సజీవదహనమైంది. కారు దగ్ధమవుతుండటాన్ని చూసిన వాహనదారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకొని ఫైరింజన్‌ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా చింటు బ్లాక్‌మెయిల్‌ కారణంగానే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శ్రీరామ్‌ సూసైడ్‌ నోట్‌ రాసి బాలిక తల్లిదండ్రులకు, తన అన్న కుమారుడికి వాట్స్‌పలో పంపించాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.

Updated Date - Jan 09 , 2025 | 04:35 PM