‘పది’ మూల్యాంకనానికి ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:45 PM
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొనసాగనుంది. అందుకు సంబంధించి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహణ
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లలో కేంద్రాలు
రెండు కేంద్రాలకు కలిపి రానున్న 3.83 లక్షల జవాబు పత్రాలు
పేపర్లు దిద్దేందుకు 1,225 మంది ఉపాధ్యాయుల నియామకం
వారికి త్వరలో ఉత్తర్వులు
కొనసాగుతున్న డీ కోడింగ్ ప్రక్రియ
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొనసాగనుంది. అందుకు సంబంధించి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ కేంద్రం ఇన్‌చార్జిగా డీఈవో ప్రవీణ్‌కుమార్, సహాయ ఇన్‌చార్జిలుగా బీఏడ్ కళాఽశాల ప్రిన్సిపాల్ మొరజూల్లా ఖాన్, పరీక్ష విభాగం అధికారి కమలాకర్, నాగర్ కర్నూల్ కేంద్రం ఇన్‌చార్జిగా డీఈవో రమేష్ వ్యవహరించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీకేరెడ్డి కాలనీలో గల మహబూబ్‌నగర్ గ్రామర్ ఉన్నత పాఠశాలలో, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం నిర్వహించనున్నారు. పరీక్షలు బుధవారంతో ముగియనున్నాయి. చివరి పరీక్ష సాంఘిక శాస్త్రం మాత్రం మిగిలింది. పూర్తయిన తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్ధూ, గణితం, భౌతిక, రసాయన శాస్ర్తాలకు సంబంధించిన జవాబు పత్రాలు ఆయా జిల్లాలకు చేరుకోగా, కొన్ని రావాల్సి ఉంది. రెండు కేంద్రాల్లో 3.83 లక్షల జవా బు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. మ హబూబ్‌నగర్ జిల్లాకు 2.50 లక్షల జవాబు పత్రా లు రానుండగా, నాగర్‌కర్నూల్‌కు లక్షా 33, 391 జ వాబు పత్రాలు రానున్నాయి.
వివిధ జిలాల నుంచి జవాబు పత్రాల రాక
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన జవాబు పత్రాలకు విద్యాశాఖ అధికారులు డీ కోడింగ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పత్రాలు ఏ జిల్లావో తెలియకుండా అధికారులు సూచించిన నెంబర్ ఇచ్చి, కంప్యూటరీకరణ చేస్తున్నారు. అం దుకు 80 మందిని నియమించారు. వారితోపాటు నలుగురు కోడింగ్ అధికారులు, 12 మంది సహాయ కోడింగ్ అఽధికారులను నియమించగా, ప్రక్రియ సాగుతోంది.
7 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయనున్నారు. సహాయకులుగా, కౌంటింగ్ తదితర పనుల కోసం సెంకండరీ గ్రేడ్ టీచర్స్, పీడీలు, పీఈటీలు మొత్తం 641 మంది విధులు నిర్వర్తించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్స్, సెంకండరీ గ్రేడ్ టీచర్లు, పీడీలు, పీఈటీలు మొత్తం 584 మంది పని చేయనున్నారు. మూల్యాంకనం కోసం ఎంపికైన ఉపాధ్యాయులకు రెండు మూడు రోజల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని మూల్యాంకనం కేంద్రాల గదుల్లో ఫ్యాన్లు, కూలర్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
పదో తరగతి జవాబు పత్రాల మూ ల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 7 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. మహబూబ్‌నగర్ కేంద్రంలో మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధ్యాయుల తోపాటు, నారాయణపేట, గద్వాల జిల్లాల ఉపాధ్యాయులు 641 మంది విధుల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన జవాబు పత్రాలకు డీకోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
- ఏ.ప్రవీణ్‌కుమార్, డీఈవో, మహబూబ్‌నగర్