ఆటాడుకుందాం రా!
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:37 PM
విద్యా సంవత్సరం ముగిసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకొనేలా, వారికి ఇష్టమైన క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా క్రీడాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
- వచ్చేనెల 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
- గ్రామ స్థాయిలో 10, మునిసిపాలిటీల్లో 5 కేంద్రాలు
- పూర్తయిన శిక్షకుల ఎంపిక
వనపర్తి రాజీవ్ చౌరస్తా, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : విద్యా సంవత్సరం ముగిసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకొనేలా, వారికి ఇష్టమైన క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా క్రీడాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే కోచ్‌ల ఎంపికను కూడా పూర్తి చేసింది. వచ్చేనెల 1 నుంచి 31వ తేదీ వరకు శిక్షణా శిబిరాలు కొనసాగనున్నాయి.
ఏ ఆట ఎక్కడ?
జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో 10, మునిసిపాలి టీల్లో ఐదు క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి ఉన్న కోచ్‌లు ఇది వరకే దరఖాస్తు చేసుకోగా ఎంపిక కూడా పూర్తయింది. మునిసిపాలిటీల్లో అవసరాన్ని బట్టి మరో రెండు శిబిరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని మదనాపూర్‌లో వాలీబాల్, గోపాల్‌పేట, ఏదుల, వీపనగండ్ల గ్రామాల్లో ఫుట్‌బాల్, ఘణపూర్, అప్పరాలలో అథ్లెటిక్స్ శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పెద్దమందడి, కడుకుంట్ల, మా ందాపూర్‌లలో హాకీ, మూలమల్లలో కబడ్డీ క్రీడా శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వనపర్తి మునిసిపాలిటీలో కిక్ బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, చెస్ క్రీడలలో శిక్షణ ఇచ్చేందుకు నాలుగు శిబిరాలను ప్రారంభించనున్నారు. ఆత్మకూరు మునిసి పాలిటీ పరిధిలో వాలీబాల్ శిబిరం ఏర్పాటు చేయ నున్నారు.
విద్యార్థులకు నెల రోజుల పాటు శిక్షణ
వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు వచ్చేనెల 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం కోచ్‌లు వివిధ క్రీడా అంశాలలో తర్ఫీదు ఇవ్వనున్నారు. 8 నుంచి 14 ఏళ్లలోపు బాల బాలికలు తమ ఆసక్తిని శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని క్రీడా శాఖ అధికారులు కోరుతున్నారు. క్రీడా పరికరాలను ప్రభుత్వమే సమకూ ర్చడంతో పాటు, ఒక్కో శిబిరం నిర్వహణ కోసం శిక్షకుడికి రూ.4 వేలు గౌరవ వేతనం, మైదానం నిర్వహణ కోసం మరో రూ. 1000 ఇవ్వనున్నది. శిబిరాల్లో మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు, మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచుతారు.
సద్వినియోగం చేసుకోవాలి
క్రీడా శిబిరాల నిర్వహణకు శిక్షకుల నుంచి దరఖాస్తులను స్వీకరించాం. శిబిరాలను నిర్వహించేందుకు స్థలాల ఎంపికను పూర్తి చేశాం. వేసవి క్రీడా శిబిరాలు విద్యార్థులు తమ క్రీడా ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడానికి చక్కగా సహాయపడతాయి. వేసవి సెలవులను సమయాన్ని వృథా చేయకుండా క్రీడలపై దృష్టి సారిస్తే ఉత్తమ క్రీడాకారులుగా రాణించ అవకాశం ఉంటుంది. విద్యార్థులు క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
- సుధీర్ కుమార్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి