Share News

ఇథనాల్‌ కంపెనీ వద్దే వద్దు

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:03 AM

ఇథనాల్‌ కంపెనీ వద్దే వద్దని పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు తేల్చి చెప్పారు.

ఇథనాల్‌ కంపెనీ వద్దే వద్దు
ఇథనాల్‌ కంపినీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులతో ఆర్డీఓ, కంపినీ ప్రతినిధులు చర్చలు నిర్వహిస్తున్న దృశ్యం

- తేల్చి చెప్పిన పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు

- గద్వాల ఆర్డీవో కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ

- మేలు జరుగుతుందని యాజమాన్యం వివరణ

- నష్టమే అంటూ ఆధారాలు చూపిన సభ్యులు

గద్వాల, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : ఇథనాల్‌ కంపెనీ వద్దే వద్దని పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు తేల్చి చెప్పారు. జోగుళాంబ గద్వాల జిల్లా, పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై మంగళవారం ఆ ర్డీవో కార్యాలయంలో, ఆర్డీవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో 14 గ్రామాల నుంచి పరిశ్రమ వ్యతిరేక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామాల పరిసరాల్లో కంపెనీ ఏర్పాటు చేయనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తాగు, సాగునీరు లభించడం కష్టంగా ఉందని, కంపెనీకి నీళ్లిచ్చి తామెలా బతకాలని, పంటలు ఎలా పండించాలని నిలదీశారు. నీరు, నేల కలుషితం అవుతుందని, భవిష్యత్తులో వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా ప్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు మేలు జరుగుతుందని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సోషల్‌ యాక్టివిటీలో భాగంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. కాలుష్య రహిత ఫ్యాక్టరీని నిర్మిస్తామని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. పరిశ్రమ వ్యతిరేక కమిటీ నాయకులు అందుకు అభ్యంతరం తెలిపారు. ఫ్యాక్టరీలు ఏర్పాటైన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను సోదాహరణంగా వివరించారు. ఇథనాల్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంటే 14 గ్రామాలను, వాటి పరిధిలోని భూములను కొనేయండి, తాము వెళ్లిపో తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చేతులెత్తి మొక్కుతాం, దయచేసి ప్యాక్టరీ కోసం కొన్న భూములను అమ్ముకొని వెళ్లిపోవాలని యాజమాన్య ప్రతినిధులకు తేల్చిచెప్పారు. దీంతో అధికారులు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. దాదాపు మూడు గంటలకు పైగా చర్చలు కొనసాగినా ఫలితం లేకపోవడంతో ముగించేశారు. కార్యక్రమంలో రాజోలి తహసీల్దార్‌ రామ్మెహన్‌, ఆర్‌ఐ శ్రీకాంత్‌, శాంతినగర్‌ సీఐ టాటా బాబు, ఎస్‌ఐ జగదీశ్వర్‌, ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:03 AM