దొంగలకుంటలో హైడ్రామా!
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:19 PM
పాలమూరు నగర శివారులోని క్రిష్టియన్‌పల్లి సర్వే నెంబర్ 127-132లో అర్ధరాత్రి ఎక్స్‌కవేటర్, టిప్పర్లతో చదును చేసే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు.
- అర్ధరాత్రి చదును చేసే ప్రయత్నం
- అడ్డుకున్న స్థానికులు
- అది కుంటకాదు.. మా పట్టభూమి అంటున్న భూ యజమాని పద్మలత
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు నగర శివారులోని క్రిష్టియన్‌పల్లి సర్వే నెంబర్ 127-132లో అర్ధరాత్రి ఎక్స్‌కవేటర్, టిప్పర్లతో చదును చేసే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. దొంగలకుంటగా పిలువబడుతున్న భూమిలో మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఎక్స్‌కవేటర్లు, టిప్పర్ల సాయంతో భూమిని చదును చేయడం వివాదాస్పదమైంది. కుంటను కబ్జా చేస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. దీంతో రాత్రి వేళ పనులను నిలిపివేశారు. గతంలోనూ ఈ భూమిపై వివాదం నెలకొంది. దీంతో భూమికి సంబంధించిన యజమానికి పద్మలత బుధవారం మీడియా ముందుకు వచ్చి ఇది పూర్తిగా పట్టా భూమి అని ఇందులో కుంటలేదని స్పష్టం చేశారు. మా పూర్వీకులకు చెందిన 21 ఎకరాల పట్టాభూమి ఉందని, ఇందులో కొంత భూమి ఫ్రీడమ్‌ఫైటర్ అయిన మానాన్న ఎంవీఎస్ కళాశాలకు ఇచ్చారని చెప్పారు. మిగిలిన భూమిలో మా అన్నదమ్ములకు పంచిన తరువాత ఇద్దరు కూతుళ్లమైన మాకు కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందన్నారు. ఆరోగ్య కారణాల రిత్యా మా భూమిని అమ్ముకుంటున్నామని, అక్కడ భూమిని చదును చేస్తుంటే కొందరు కావాలనే అక్కడ దొంగల కుంట ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కుంట అనేది లేదని, పైనుంచి వచ్చే నీరు అక్కడ నిలుస్తుందని, సర్వేనెంబర్ 151లో కుంట ఉందన్నారు. మా భూమిలో మేము పనిచేసుకోవడానికి రాత్రి అయితే ఎంటి? పగలు అయితే ఏంటని ఆమె ప్రశ్నించారు. 1954 నుంచి ఇందుకు సంబంధించి పత్రాలన్నీ తమ వద్ద ఉన్నాయని, మా పూర్తికుల నుంచి వచ్చిన భూమి తప్పా ఇందులో ప్రభుత్వ భూమి, కుంటలు లే వని స్పష్టం చేశారు.