వరికి వడగళ్ల గండం
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:20 PM
వరి పంటకు వడగళ్ల గండం చుట్టుకుంది.
- ఆందోళనలో రైతులు
- ఇప్పటికే రెండు గ్రామాల్లో 1242.24 ఎకరాల్లో వరి పంట నేలపాలు
భూత్పూర్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : వరి పంటకు వడగళ్ల గండం చుట్టుకుంది. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విలయ తాండవం చేస్తే ఆశలన్నీ ఒక్క క్షణంలో అడిఆశలై పోతున్నాయని చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఈసారి రబీలో దాదాపుగా 13,052 ఎకరాల్లో సన్న రకం, దొడ్డు రకం (1010) 14,050 ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకుగాను మొత్తం 35,375 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల చేతికి రావాలి. ఇది వ్యవసాయాధికారుల లెక్క. అయితే గత 14 రోజుల క్రితం కురిసిన అకాల వడగళ్ల వర్షం కారణంగా మండలంలోని కర్వెన, మద్ధిగట్ల, వెల్కిచర్ల గ్రామాల్లో 1242.24 ఎకరాల్లో వరి పంట 50 శాతంకు పైగా దెబ్బతిన్నది. అదే విధంగా 35 ఎకరాల్లో మొక్కజొన్న నేలపాలైనట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు. ఇదిలా ఉంటే మండలంలోని కర్వెన, మద్ధిగట్ల, పాతమొల్గర, అమిస్తాపూర్ గ్రామాల్లో 65 ఎకరాల్లో మామిడ తోటలు పాడైపోయాయి. రైతులు సాగు చేసిన వరి పంట ఇంకా 15 రోజులైతే దాదాపుగా 80శాతం కోతకు వచ్చే అవకాశం ఉండగా, ప్రస్తుతం కేవలం 10 శాతం పంట మాత్రమే కోత కోసినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మార్చి చివరి వారం నుంచే సాయంత్రమైతే చాలా గాలి, వాన, వడగళ్లు బీభత్సం సృష్టిస్తుండటంతో ప్రకృతిపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు.