Share News

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:22 PM

మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి నిర్మూలనకు అన్ని శాఖలు పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు.

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి నిర్మూలనకు అన్ని శాఖలు పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎస్పీ జానకితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి, మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ జిల్లాను మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి రహిత జిల్లాగా రూపొందించాలన్నారు. చిన్న పిల్లలు, మహిళల మానవ అక్రమ రవాణా గుర్తించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమస్య వస్తే చట్ట పరంగా తీసుకోవల్సిన చర్యలు, సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ముంబై, ఢిల్లీ, ఇతర రాష్టాలతో పోల్చుకుంటే మహబూబ్‌నగర్‌ జిల్లాలో చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మానవులను ఒక ఆట వస్తువుగా లైంగిక హింసకు గురిచేయడం, పని మనుషులుగా పనిచేయడం కోసం తదితర కారణాలతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు రవాణా చేయడం జరుగుతుందని దాన్ని అరికట్టాలన్నారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే అనుకున్నది సాధిస్తామన్నారు. అక్రమ రవాణా ముఖ్యంగా టీనేజ్‌ అమ్మాయిల్లో ఎక్కువ శాతం జరుగుతుందన్నారు. వీరిని ట్రేస్‌ చేయడం సులభం కాదని, చైల్డ్‌ మ్యారేజీలను నిల్వరించాలని కోరారు. న్యాయసేవాధికారం సంస్థ కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులకు తమవంతుగా సహకారం అందిస్తామన్నారు. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, డీఎంహెచ్‌వో కృష్ణ, ఇంటర్‌నేష్నల్‌ జస్టీస్‌ మిషన్‌ జోబి ఏసుదాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:22 PM